
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Tirumala Srivari Brahmotsavam) రెండో రోజైన బుధవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వాహనసేవ సందర్భంగా తిరుమాడ వీధులు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. మంగళవాయిద్యాల నడుమ, వేదఘోషలు, భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు వాహనసేవకు మరింత శోభను చేకూర్చి భక్తులను విశేషంగా అలరించాయి. హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానస్వరూపుడిగా ప్రకాశిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు తెలియజేస్తున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనం కాగా, అది జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. పాలు-నీళ్లను వేరుచేసే హంస స్వభావం వివేకానికి, ఆత్మ-అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొంటారు. పరమాత్మ తత్వాన్ని గ్రహించి, ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయులను ఉపనిషత్తులు ‘‘పరమహంసలు’’గా అభివర్ణిస్తాయి. ఈ నేపథ్యంలో భక్తుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వివేకజ్ఞానాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక ఉన్నతికి చేర్చే సంకల్పానికి హంస వాహనసేవ ప్రతీకగా నిలుస్తుంది. శ్రీవారి దివ్య దర్శనంతో భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతి వెలిగి, ఆధ్యాత్మిక చైతన్యం వికసించాలని ఈ సేవ సందేశమిస్తుంది. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, తితిదే ఛైర్మన్ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.