
ప్రభుత్వ ఆమోదమే తరువాయి వేగం పుంజుకోనున్న అనుమతుల ప్రక్రియ ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం కేవలం పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ‘బిల్డ్‌నౌ’ విధానం ఇకమీదట పంచాయతీలలో కూడా అమలు చేయనున్నారు. దాంతో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల వంటివాటి అనుమతి ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తికానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రభుత్వం ఆమోదం పొందిన వెంటనే పంచాయతీలలోనూ ఇది అమలులోకి రానుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. నగరపాలక, పురపాలక సంస్థల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు పొందడం పెద్ద ప్రహసనంగా ఉండేదన్న సంగతి తెలిసిందే. దీన్ని సరళతరం చేసేందుకే ప్రభుత్వం గతంలో తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ సిస్టం (టీజీబీపాస్‌) పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్‌లు వంటివాటి నిర్మాణాలకు కార్యాలయానికి వెళ్లకుండానే టీజీబీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భవన నిర్మాణ నిబంధనలకు లోబడి రూపొందించిన డ్రాయింగ్‌లను, సంబంధిత పత్రాలను టీజీబీపాస్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఎంత వైశాల్యంలో, ఎన్ని అంతస్తుల్లో నిర్మిస్తున్నారు.. అక్కడ ఎంత వెడల్పు రోడ్డు ఉంది వంటి వివరాలన్నీ అప్‌లోడ్‌ చేయాలి. దీనిప్రకారం సదరు నిర్మాణానికి ఏమేరకు సెట్‌బ్యాక్‌లు వదలాలి.. అసలు అక్కడ ఎన్ని అంతస్తులకు అనుమతి ఉంది వంటి వివరాలన్నీ ముందుగానే కంప్యూటర్లో క్రోడీకరించి ఉంటాయి. అవన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయా, లేవా అన్నది కంప్యూటరే విశ్లేషిస్తుంది. ఇదంతా పూర్తిచేసి అంతా సవ్యంగా ఉందంటే వెంటనే అనుమతి ఇచ్చేస్తుంది. లేకపోతే డ్రాయింగ్స్‌ను సరిదిద్ది మళ్లీ దరఖాస్తు చేయాలి. బహుళ అంతస్తుల భవనాల వంటివాటి అనుమతులకు 2 నుంచి 30 రోజుల సమయం తీసుకునేది. దాంతో టీజీబీపాస్‌ వల్ల కూడా దరఖాస్తుదారులకు పాక్షిక ప్రయోజనమే కలిగింది. దీన్ని చక్కదిద్దేందుకు టీజీబీపాస్‌కు కృతిమ మేధ జోడించి ‘బిల్డ్‌నౌ’ పేరుతో కొత్త అప్లికేషన్‌ సిద్ధం చేశారు. 2024 మార్చి నుంచి లాంఛనంగా ప్రారంభమైన ‘బిల్డ్‌నౌ’ ప్రస్తుతం 123 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లలో అందుబాటులో ఉంది. దీన్ని రాష్ట్రంలోని 12,000 పైగా పంచాయతీలలోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ‘బిల్డ్‌నౌ’ ద్వారా దరఖాస్తు చేసుకున్న నిమిషాల్లోనే అనుమతి ప్రక్రియ పూర్తవుతుంది. ఎంత వేగంగా అంటే ఉదాహరణకు ఖాజాగూడ సమీపంలో 25 ఎకరాల్లో ఒక్కోటి 56 అంతస్తుల్లో మొత్తం 8 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 12 బ్లాకులకు బిల్డ్‌నౌ ద్వారా కేవలం 5 నిమిషాల్లో అనుమతి లభించింది. పంచాయతీల పరిధిలో ఇంత పెద్ద భవనాలు లేకపోయినా ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ చాలినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల అనుమతులు ఆలస్యమవుతున్నాయి. అందుకే ‘బిల్డ్‌నౌ’ అందుబాటులోకి వస్తే పంచాయతీల్లోనూ నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





