
పునాది దశలో ఉన్న స్థలం ముందు రోడ్డుమీద టెంటు.. అక్కడే తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న పద్మ జనగామ, న్యూస్‌టుడే: సాంకేతిక అవాంతరంతో సొంత ఇంటి కల నెరవేరక అద్దె ఇంట్లో తలదాచుకుంటున్న కుటుంబంలో మరణం సంభవించి.. అంతిమ సంస్కారాలకు కాసింత నీడ కోసం ఆ కుటుంబం పడిన వేదన హృదయవిదారకం. గూడు లేని ఈ గోడుకు జనగామ జిల్లా కేంద్రం వేదికైంది. జనగామ వీవర్స్‌ కాలనీకి చెందిన ముత్యం లక్ష్మి(84)కి కూతురు మామిళ్ల పద్మ(55) కుటుంబమే దిక్కు. పద్మ దంపతులకు ఒక బిడ్డ, ఇద్దరు కుమారులు సంతానం. వారి జీవితం అద్దె ఇంట్లోనే గడుస్తోంది. ఉన్న కొద్దిపాటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని తలదాచుకోవాలనే ఆశతో పద్మ అర్జీ పెట్టుకున్నారు. ఇల్లు మంజూరైందనే సమాచారంతో అప్పు చేసి పునాది కట్టారు. ఖాళీ స్థలం వద్ద తన ఫొటో తీసుకుని యాప్‌లో చేర్చాకే, పని ప్రారంభించాలనే నిబంధన ఆమెకు తెలియదు. కౌన్సిలర్‌ నుంచి కలెక్టర్‌ వరకు ఆమె అర్జీలు పెట్టుకున్నా, సాంకేతిక నిబంధన అడ్డు తగలడంతో, ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఆ పునాది అలాగే ఉంది. వయో భారంతో పద్మ తల్లి ముత్యం లక్ష్మి ఆదివారం తుది శ్వాస విడిచారు. అద్దె ఇంట్లో అంత్యక్రియలు కుదరవని, దినవారాలు దాటేదాకా ఇంట్లోకి రావద్దని యజమాని చెప్పారు. ఇక చేసేది లేక, తల్లి మృతదేహాన్ని ఇల్లు పునాది దశలో ఉన్నచోటుకు చేర్చారు పద్మ. దాని ముందు రోడ్డుపై టెంటు వేసి తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వీవర్స్‌ కాలనీలో ఈ తరహా నాలుగో ఘటన ఇది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





