
MDR on UPI | దిల్లీ: రెండు వేల రూపాయల్లోపు యూపీఐ ( UPI ), రూపే డెబిట్‌ కార్డుతో చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలూ ఉండబోవని కేంద్రం స్పష్టంచేసింది. మరి ఆపైన లావాదేవీలపై ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లతో కూడిన ప్యానెల్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 22 మంది సభ్యులతో ఏర్పాటైన ‘ది యూపీఐ అండ్‌ సర్వీసెస్‌ స్టీరింగ్‌ కమిటీ’ రూ.2వేలు దాటిన లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును త్వరలో నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్వయం సుస్థిరత, మార్కెట్ విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఛార్జీలను ఖరారు చేయనుంది. వారంలోపే దీనిపై నిర్ణయం ఉండొచ్చని, అక్టోబర్‌ నుంచే ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రెజిల్‌లో పీఐఎక్స్‌ చెల్లింపుల వ్యవస్థలో 0.33 శాతం మర్చంట్‌ రేటు వసూలు చేస్తున్నారు. చైనాలో చెల్లింపుల వ్యవస్థలో ఇది 0.40 శాతంగా ఉంది. భారత్‌లో ఈ మొత్తం ఎంత ఉంటుందనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. పెద్ద వ్యాపార చెల్లింపులపై 0.3-0.5% వరకు ఎండీఆర్‌ విధించొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, రూ.2000 లోపు యూపీఐ, రూపే డెబిట్‌ కార్డులపై చెల్లింపులకు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం తాజాగా స్పష్టంచేసింది. ఆపై వ్యక్తులు పంపుకొనే నగదు లావాదేవీలకూ ఛార్జీలు ఉండవు. కేవలం వ్యాపారులకు చెల్లించే మొత్తంపైనే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును విధిస్తారు. అయితే, ఈ ఛార్జీల వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడబోదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులు ఆ భారాన్ని కస్టమర్లపైకి నెడతారేమోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.