
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన పీఏ, పీఆర్వోల ప్రవర్తనపై తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్షంలో ఉన్నామనే నిరాశతో బీఆర్ఎస్ నేతలు మీడియా దృష్టిని ఆకర్షించేందుకే నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ కంటే ఘాటుగా తిట్టడం తమకు వచ్చని, అయితే తమ తల్లిదండ్రులు విజ్ఞత, సంస్కారం నేర్పించారని పేర్కొన్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై ఎలాంటి దాడి జరగలేదని ఉన్నతాధికారులు ఇప్పటికే తేల్చిచెప్పారని, గణేశ్ మండపం డీజే అనుమతి కోసం వచ్చిన కొందరు యువకుల సమక్షంలో కేటీఆర్ సిబ్బంది అనవసరంగా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వాడిన అనుచిత భాషనే కేటీఆర్ పీఏ, పీఆర్వోలు కూడా పోలీసులపై ఉపయోగించారని, ఇది కేటీఆర్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ తీరు వల్ల ఒక సామాజిక వర్గానికి చెడ్డపేరు వస్తోందని, తెలంగాణ సమాజానికి, దళితులకు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పక్కటెముకలు విరిగినా ఏనాడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని వెంకట్ అన్నారు. కేటీఆర్ సిబ్బంది ప్రవర్తన మార్చుకోకపోతే పోలీసులు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.