
Arunachaleswarar Temple Mobile Phone Ban Tiruvannamalai Hn 1130432
Arunachaleswarar Temple Mobile Phone Ban : తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అన్నా మలైయార్ (అరుణాచలం) ఆలయానికి వెళ్లే భక్తులకు ఆలయ నిర్వాహకులు కీలక సూచనలు చేశారు.
Arunachaleswarar Temple Mobile Phone Ban : తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అన్నా మలైయార్ (అరుణాచలం) ఆలయానికి వెళ్లే భక్తులకు ఆలయ నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనల అమల్లోకి వచ్చాయి. ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకురావడాన్ని నిషధించారు. ఆలయ పవిత్రతను కాపాడంతోపాటు, గర్భగుడి పరిసరాలలో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరణను నియంత్రించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ముందుగానే ఈ నిబంధనపై అవగాహన కల్పించాలని ఆలయ అధికారులను రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి సి. రమేష్ ఆదేశించారు.
తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రాల్లో అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పౌర్ణమి, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయంలోకి వస్తున్న భక్తులు అధికశాతం మంది మొబైల్ ఫోన్లను తీసుకొని వస్తుండటంతోపాటు.. దర్శన సమయంలో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చేస్తుండటంతో తొటి భక్తులకు ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు ఆలయ పవిత్రత, ఆగమ సంప్రదాయాలను పరిరక్షించడంలో భాగంగా ఆలయంలోకి ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రముఖులు లేదా వీఐపీలు ఆలయానికి వచ్చిన సమయంలో వారి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకుండా కూడా ప్రత్యేక ఆంక్షలు విధించారు. వీఐపీల దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తమకు తెలియజేయాలని ఆలయ నిర్వాహకులు సూచించారు.
మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిన వారు ఇలా చేయండి.. భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకెళ్లినట్లయితే.. ఆలయంలోకి వెళ్లే సమయంలో భద్రతా కేంద్రాల్లో తమ ఫోన్లను డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ తూర్పు వైపున ఉన్న రాజగోపురం సమీపంలో రెండు మొబైల్ భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉత్తర వైపున ఉన్న అమ్మని అమ్మన్ గోపురం సమీపంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దక్షిణ వైపున ఉన్న తిరుమంజన గోపురం సమీపంలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.
భద్రతా కేంద్రాల వద్ద ఒక్కో మొబైల్ ఫోన్కు రూ.5రుసుము చెల్లించి, టోకెన్ తీసుకొని ఫోన్ను భద్రపర్చుకోవచ్చు. దర్శనం అనంతరం టోకెన్ చూపించి తమ మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లే అవకాశాన్ని ఆలయ నిర్వాహకులు కల్పించారు.
ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఆలయం లోపలికి మొబైల్ పోన్లను తీసుకెళ్లే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, భక్తులు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ తో ఆలయంలోకి వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే మొబైల్ ఫోన్ నిషేధంపై భక్తులకు ముందుగానే సమాచారం అందించాలని రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి సి. రమేష్ స్పష్టం చేశారు. ఇందుకోసం వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.






