
జీవితం అంటే కేవలం బాధ్యతల నడుమ కొట్టుకుపోవడం కాదనీ, సంకల్పం ఉంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు కల్నల్ శివాని సంగ్వాన్. తాజాగా ఆమె... అత్యంత కఠినమైన సిల్క్ రూట్ అల్ట్రా మారథాన్లో 9వ స్థానంలో నిలిచారు. జీవితం అంటే కేవలం బాధ్యతల నడుమ కొట్టుకుపోవడం కాదనీ, సంకల్పం ఉంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు కల్నల్‌ శివాని సంగ్వాన్‌ . తాజాగా ఆమె... అత్యంత కఠినమైన సిల్క్‌ రూట్‌ అల్ట్రా మారథాన్‌లో 9వ స్థానంలో నిలిచారు. దీన్ని పూర్తిచేసిన సాయుధ దళాలకు చెందిన తొలి అధికారిణిగా చరిత్ర సృష్టించారు. ల ద్ధాఖ్‌లో నిర్వహించే ‘సిల్క్‌ రూట్‌ అల్ట్రా’ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన, కఠినమైన ఎత్తైన ప్రదేశాల పరుగు పందేలలో ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 10న జరిగిన ఈ అయిదో ఎడిషన్‌ రేసు నుబ్రా లోయలోని క్యాగర్‌ గ్రామంలో ప్రారంభమై, ప్రసిద్ధ ఖార్దుంగ్‌ లా వైపు ఎత్తుకు ఎక్కడంతో సాగి, లేహ్‌ మార్కెట్‌ వద్ద ముగిసింది. మొత్తం 122 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల్లో నిర్దేశిత గడువుల మధ్య చేరుకోవాలి. అయితే, అదేమంత తేలిక కాదు. ఈ దారిలో సుమారు 2,700 మీటర్ల ఎత్తుకు ఎక్కాల్సి ఉంటుంది. తక్కువ ఆక్సిజన్, నిటారుగా ఉండే కొండలు, మైనస్‌ డిగ్రీల చలి, ఊహించని వాతావరణ మార్పులు... వంటివెన్నో రన్నర్లను కఠినంగా పరీక్షిస్తాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ కల్నల్‌ శివాని సంగ్వాన్‌ నిర్దేశిత సమయంలో ఈ మారథాన్‌ను పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన సాయుధ దళాలకు చెందిన తొలి అధికారిణిగా చరిత్ర సృష్టించారు. మహిళల విభాగంలో తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అల్ట్రా-రన్నింగ్‌లాంటి సాహసాలు శివానికి కొత్తేమీ కాదు. 2022 హండ్రెడ్‌ డేస్‌ ఆఫ్‌ రన్నింగ్‌లో పోడియం ఫినిష్‌ సాధించారు. రెండేళ్ల తర్వాత అత్యంత సవాలుతో కూడిన 100 కిలోమీటర్ల బోర్డర్‌ అల్ట్రాను విజయవంతంగా పూర్తి చేశారు. గతేడాది 72 కిలోమీటర్ల ఖార్దుంగ్‌ లా ఛాలెంజ్‌లో మహిళల విభాగంలో టాప్‌-10లో స్థానం సంపాదించారు. ఈ ఏడాదిలో మనాలి నుంచి సిస్సు వరకు జరిగిన 84 కిలోమీటర్ల రోహ్‌తాంగ్‌ ఎపిక్‌తో పాటు గురుగ్రామ్‌ ట్రైల్‌-ఏ-థాన్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరిచారు. శివాని ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ సూపర్‌ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. మరోపక్క ఇద్దరు పిల్లల బాధ్యతలు, కుటుంబ నిర్వహణ చూసుకుంటూనే సాధన చేశారు. ‘దైనందిన జీవితంలోని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం, తనలోని మానసిక స్థైర్యాన్ని పరీక్షించుకోవడానికి తాను ఓర్పుతో కూడిన ఈ పరుగును ఎంచుకున్నానంటారు’ శివాని. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings