
అమరావతి, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. APPSCతో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ చేసే నాన్-యూనిఫాం ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వయోపరిమితి కారణంగా ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండగా.. తాజాగా దాన్ని 44 సంవత్సరాలకు పెంచారు. అంటే అర్హత కలిగిన అభ్యర్థులు అదనంగా 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపును పొందనున్నారు. ఈ ప్రత్యేక వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలంలో చేపట్టే సంబంధిత నాన్-యూనిఫాం పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు పెంచిన గరిష్ట వయోపరిమితి వర్తించనుంది.