
కోరుట్ల, సెప్టెంబర్ 16: జగిత్యాల జిల్లా కోరుట్లలో అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కారు. బుధవారం జాతీయ రహదారిపై బైఠాయిం చారు. కోరుట్లలో అంగన్వాడీ టీచర్ అన్నం లక్ష్మి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘సర్’ సర్వే పేరిట అంగన్వాడీ టీచర్లను బలి పశువులను చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రూ.13 వేల వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలను 18 గంటలపాటు పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘సర్’ సర్వేతో రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్లు చేస్తుండటంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయని తెలిపారు. కోరుట్లలో లక్ష్మి హత్యకు ‘సర్’ సర్వే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ సర్వేను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కోరుట్లలో హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, అందుకు కారకుడైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.





