
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ల జారీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్తగా జీవో నెంబర్ 592ను ప్రభుత్వం విడుదల చేసింది. 2015లో తెచ్చిన జీవో 581ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి తహసీల్దార్‌కు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని అప్పగించింది. ఇక నుంచి ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం అవసరమైతే తహసీల్దార్‌కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ డాక్యుమెంట్లు పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే స్థానికంగా విచారణ జరిపిన అనంతరం రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. విద్య, ఓటర్ జాబితా సవరణ, ఉద్యోగులు, ఆధార్ నమోదు కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. ఈ క్రమంలో ప్రభుత్వం తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.





