
వైకాపాలో నంబర్‌వన్‌ ఎవరైతే వారు సమాధానం చెప్పాలి: విజయసాయిరెడ్డి ఈనాడు, అమరావతి: ‘వైకాపాలో గతంలో ఎంతమంది నాయకులు.. ఎమ్మెల్యే టికెట్ల కోసం, తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం, జగన్‌ను ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో ఇప్పుడు వైకాపాలో నంబర్‌వన్‌ ఎవరైతే వారు సమాధానం చెప్పాలని కోరుతున్నా’ అని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్‌ చేశారు. 2024 ఎన్నికల ముందు వైకాపా అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి క్రైస్తవ సభలో మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను పోస్ట్‌తోపాటు సాయిరెడ్డి ట్యాగ్‌ చేశారు. ‘140 రోజుల తర్వాత మనకు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. అది జగన్‌ కావాలని నా కోరిక. ముఖ్యమంత్రిగా జగన్‌ ఉంటే మనం ఎంత బలంగా ఉండవచ్చో వేదిక మీదున్న పెద్దలందరికీ తెలుసు. గత ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాంతంలో ఇటువంటి సభలు పెట్టుకోవాలంటే ఎన్ని బాధలు పడేవారో ఇక్కడున్న పాస్టర్‌ పెద్దలకు తెలుసు. గతంలో ఎమ్మెల్యేలకు లంచాలిస్తే తప్ప సభ జరిగేది కాదు. అందుకనే మన సభలు బాగా జరగాలన్నా, మన దేవుడిని బాగా ప్రార్థించుకోవాలన్నా, మనం స్వేచ్ఛగా ఉండాలన్నా క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్‌ మరలా పీఠం మీదకు రావాలి. దానికి మీరంతా దీవించాలి.. ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





