
బిడ్లలో అర్హత సాధించింది శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఒక్కటే ఇది వైకాపా నేత మద్దతున్న సంస్థగా ప్రచారం అధికారులు వద్దన్నా.. టెండరు ఎలా ఖరారైంది? ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల భద్రత బాధ్యతలు చూసే టెండరు శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌కు ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు జారీచేసింది. సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో 869 మంది సెక్యూరిటీ గార్డులు, 19 మంది సెక్యూరిటీ సూపర్‌వైజర్లను సమకూర్చే సంస్థ కోసం టెండర్లు పిలిచారు. ఇందులో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సంస్థతోపాటు, ఫస్ట్‌మ్యాన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సంస్థ బిడ్లు వేసింది. టెండరు మూల్యాంకన కమిటీ వాటిని పరిశీలించి, శ్రీకార్తికేయ సెక్యూరిటీ సంస్థ ఒక్కటే అర్హత సాధించినట్లు తేల్చారు. దీంతో ఆ సంస్థకు టెండరు ఖరారు చేయగా, దానికి రెండేళ్లపాటు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి కె.కన్నబాబు బుధవారం ఉత్తర్వు జారీచేశారు. శ్రీకార్తికేయ సెక్యూరిటీ సంస్థ శ్రీశైలం ఆలయంలో చాలాకాలంగా సెక్యూరిటీ, సదుపాయాల కల్పన బాధ్యతలు చూస్తోంది. దీనికి వైకాపా నేత సంపూర్ణమద్దతు ఉందనే ప్రచారం ఉంది. ఆయన ద్వారానే ఆ సంస్థ గతంలో శ్రీశైలంలో భద్రత టెండరు దక్కించుకుంది. వైకాపా ప్రభుత్వంలోనూ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు అదే కొనసాగింది. ఈ ఏడాది శివరాత్రి సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలున్నాయని భక్తులు ఆందోళనకు దిగారు. దీనికి ఈ సెక్యూరిటీ సంస్థ వైఫల్యమూ ఓ కారణమనే విమర్శలు ఉన్నాయి. సదుపాయాల కల్పన సరిగా లేదని దేవాదాయ అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. అలాంటి సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రధాన ఆలయాల సెక్యూరిటీ టెండరు ఖరారు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టెం డర్లలో ఒకరే అర్హత సాధిస్తే, పోటీ లేకుండా.. ఆ సంస్థ ఎంత మొత్తానికి కోట్‌ చేస్తే, అంత చెల్లించాలి. సింగిల్‌ బిడ్డరే ఉంటే.. ఆ టెండర్లను రద్దుచేయొచ్చు. ఆలయాల సెక్యూరిటీ టెండర్లలోనూ ఇదే జరుగుతుందని అంతా భావించారు. అనూహ్యంగా ఒకే సంస్థ అర్హత సాధించినా, దానికి బిడ్‌ ఖరారు చేశారు. తొలుత గత ఏడాది జులైలో టెండరు పిలిచారు. అప్పట్లో శ్రీకార్తికేయ, సేవా సుప్రీమ్‌ డిటెక్టివ్‌ అండ్‌ సెక్యూరిటీ, మెటా ఫోర్స్, ఎజైల్‌ సెక్యూరిటీ సంస్థలు బిడ్లు వేశాయి. ఇందులో ఎజైల్‌ సంస్థ అర్హత సాధించలేదు. ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. చివరకు టెండరును రద్దుచేశారు. తర్వాత గత ఏడాది అక్టోబరులో మళ్లీ టెండరు పిలిచారు. అప్పుడే శ్రీకార్తికేయ, ఫస్ట్‌మ్యాన్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు బిడ్లు వేయగా.. శ్రీకార్తికేయ ఒక్కటే సాంకేతిక అర్హత సాధించింది. ఆ సంస్థపై ఉన్న విమర్శలు తదితరాలన్నీ పేర్కొంటూ దేవాదాయ కమిషనరేట్‌ నుంచి దస్త్రం వెళ్లింది. అయినా ఆ శాఖ మంత్రి నుంచి ఈ దస్త్రం ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు. ఆర్థికశాఖ పలు కొర్రీలు వేసి, కమిషనర్‌ను వివరణ కోరింది. ఈ మేరకు కమిషనర్‌ ఆయా వివరాలన్నీ ఆర్థికశాఖకు అందజేశారు. ఈ నేపథ్యంలో.. టెండరు రద్దు చేస్తారని అంతా భావించినట్లు తెలిసింది. కానీ ఆ సంస్థకే బిడ్‌ ఖరారుచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనివెనుక ఎవరు చక్రం తిప్పారనేది చర్చ జరుగుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





