
30 లక్షల టన్నులు రిజర్వ్‌ చేయాలని ఆదేశం ఏ, బీ గ్రేడ్లవి పూర్తిగా ఓఎన్‌జీసీకి కేటాయింపు ఈనాడు, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో తవ్వి తీసిన సీ, డీ గ్రేడ్ల ముగ్గురాయి ఎగుమతులకు లైన్‌ క్లియరైంది. గతంలో వాటిపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన కేంద్రం.. తాజాగా ఎగుమతులకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి వద్ద జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మంగంపేట గనుల్లో తవ్వితీసిన ముగ్గురాయిలో ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ఉంటాయి. వీటిని గ్యాస్, ఆయిల్‌ డ్రిల్లింగ్‌ సమయంలో వినియోగిస్తారు. ముగ్గురాయి క్రిటికల్‌ మినరల్‌ అని, దీన్ని ఎగుమతి చేయకుండా అడ్డుకోవాలంటూ కొందరు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏ, బీ గ్రేడ్ల ముగ్గురాయిపై కేంద్రం ఆంక్షలు విధించింది. సీ, డీ గ్రేడ్లను ఎగుమతులకు అనుమతిస్తూ ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకుంది. తర్వాత మళ్లీ పునఃసమీక్ష నిర్వహించి.. సీ, డీ గ్రేడ్లపై కూడా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇలాచేస్తే ఏపీఎండీసీ రాబడిపై ప్రభావం పడుతుందని.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అయినాసరే ఆ శాఖ ముందడుగు వేస్తుండటంతో.. నేరుగా ప్రధానికి ఈ నెల ఆరంభంలో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినేట్‌ సెక్రటరీ టీవీ సోమనాథన్‌.. బుధవారం దిల్లీలో సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మంగంపేట గనుల్లో ఇప్పుడున్న ఏ, బీ గ్రేడ్ల ముగ్గురాయి నిల్వలు, వచ్చే రెండేళ్లలో తవ్వి తీసేది కలిపి 25 లక్షల మెట్రిక్‌ టన్నులను ఓఎన్‌జీసీ మాత్రమే రిజర్వ్‌ చేస్తారు. ఆ గనుల వద్ద సీ, డీ గ్రేడ్ల ముగ్గురాయి ప్రస్తుతం 70 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉండగా, మరో రెండు మూడేళ్ల తవ్వకాల ద్వారా ఇంకో 30 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుంది. మొత్తం కోటి మెట్రిక్‌ టన్నుల సీ, డీ గ్రేడ్ల ముగ్గురాయిలో 70 లక్షల టన్నులు ఎగుమతి చేసుకోవచ్చని అనుమతించారు. మిగతా 30 లక్షల టన్నులు మాత్రం భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ ఉంచాలని నిర్ణయించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





