
ఈనాడు, కడప : అందరూ సమానమే.. అనే భావన పిల్లల్లో చిన్నప్పటి నుంచే కలగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో కుల, వర్గ భేదాలు తొలగించి సామాజిక సమానత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్టీలు పళ్లేలు’ పంపిణీ చేస్తోంది. ‘హబ్‌-స్పోక్‌’ నిర్వహణ విధానంలో వైఎస్సార్‌ కడప జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో తమ ఇళ్ల నుంచి తెచ్చుకునే ప్లాస్టిక్, ఇతర కంచాల్లో కాకుండా వీటిల్లోనే భోజనం చేస్తుంటారు. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి అక్కడే పెడతారు. పాఠశాల సిబ్బంది మరోసారి స్టీమ్‌ క్లీనింగ్‌ చేసి మరుసటి రోజు విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. ఏ ఒక్కరిలోనూ తారతమ్యాలు, వివక్ష లేకుండా సోదరభావం అలవర్చడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,237 పాఠశాలల్లో 69,823 పళ్లేలు పంపిణీ చేశారు. ఒక పాఠశాలను ప్రధాన కేంద్రంగా (సెంట్రల్‌ హబ్‌) తీర్చిదిద్ది, దీనికి అనుబంధంగా పది చొప్పున బడులను జోడించారు. భోజనానికి ముందు, తర్వాత విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా ప్రత్యేక ‘హ్యాండ్‌వాష్‌’ ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





