
బాధిత రైతు శ్రీనివాస్‌ నుంచి వివరాలను ఆరా తీస్తున్న సీఐ మహానంది ఉరవకొండ, వజ్రకరూరు, న్యూస్‌టుడే: రైతు ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన ఉరవకొండలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత రైతు మాదినేని శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా.. ఆయన ఉరవకొండ శివారులోని జాతీయ రహదారికి సమీపంలో లత్తవరం గ్రామ పొలాల్లో ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల వారి కుటుంబం పొలం అమ్మింది. దాని ద్వారా రూ.60లక్షలు వచ్చాయి. వాటిలో కొంత మొత్తం బ్యాంకులో జమ కాగా, మిగతా రూ.45లక్షలు ఇంటిలో దాచుకున్నారు. దానిని వారు కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి, నవంబరులో జరగనున్న కొడుకు వివాహానికి వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఉంచుకున్నారు. సాయంత్రం ఆయన తన భార్య లక్ష్మిని పిలుచుకురావడానికి బళ్లారికి వెళ్లారు. ఆ సమయంలో తమ వ్యవసాయ కూలీలు ఆ పరిసరాల్లో ఉండేలా చూసుకున్నారు. వారు పని ముగించుకుని చీకటి పడిన తరువాత వెళ్లారు. రైతు కుటుంబం రాత్రి 8:15 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి ప్రధాన ద్వారాన్ని దొంగలు ధ్వంసం చేసి ఇంటిలో వస్తువులను చెల్లాచెదురు చేసి ఒక ప్రత్యేక బ్యాగులో మంచం కింద దాచుకున్న రూ.45 లక్షల నగదును దోచుకెళ్లారు. ద్వారం అంచునే దేవుని పటం వద్ద పూజకు ఉంచిన రూ.2లక్షలు, చోరీ జరిగిన గదిలో పైనే ఉంచిన రూ.50వేల నగదును దొంగలు ముట్టుకోలేదు. చోరీని గుర్తించిన బాధితుడు డయల్‌ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ మహానంది తమ సిబ్బందితో బాధితుడి ఇంటికి చేరుకుని విచారించారు. బాధితుల నుంచి పూర్తి వివరాలను సేకరించారు. ఈ ఘటన పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా చోరీ జరిగిన సమయంలో ఉరవకొండతో పాటు పరిసర గ్రామాల్లో సుమారు 2గంటల పాటు అప్రకటిత విద్యుత్తు కోతను విధించారు. ఇది కూడా దొంగలకు కలిసి వచ్చిందంటూ స్థానికులు చర్చించుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.