
తెనాలి టౌన్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై యువతిని మాయ మాటలతో మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవీంద్రబాబు, ఎస్సై సురేశ్‌ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన బీటెక్ చదువుతున్న యువతికి అదే ప్రాంతంలో ఉండే పవన్ సాయి ఇన్‌స్టా ద్వారా పరిచయం అయ్యాడు. చాటింగ్‌లో మాటలు కలిసిన తర్వాత స్నేహంగా ఉంటున్నట్లు నటించాడు. అనంతరం తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి విడతల వారీగా యువతి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, కొంత నగదు తీసుకున్నాడు. ఇంట్లో వారు బంగారు నగల గురించి ప్రశ్నిస్తూ ఉండడంతో యువతి వాటిని తిరిగి ఇవ్వాలని పవన్ సాయిని కోరింది. దీంతో అతడు బెదిరింపులకు దిగాడు. ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని, చంపుతానని బెదిరించాడు. తాను మోసపోయానని గుర్తించిన యువతి.. ఈ విషయాన్నంతా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పవన్‌ సాయిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి బంగారపు గొలుసు, రెండు ఉంగరాలు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల పరిచయాలను, గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.