
గన్నవరం: పేదల ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ల ప్రధాన ధ్యేయమని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గన్నవరం బాయ్స్‌ హైస్కూల్‌ మైదానం పక్కన ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను బుధవారం ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు. అనంతరం ఆటో కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన మాధురి అనే విద్యార్థి తాను దాచుకున్న పాకెట్‌ మనీ నుంచి రూ.2,500, విశ్రాంత అధ్యాపకుడు మద్దుకూరి విజయ్‌కుమార్‌ రూ.లక్షను అన్న క్యాంటీన్ నిర్వహణ కోసం విరాళంగా అందించారు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమానికి స్వచ్ఛందంగా విరాళాలు అందించిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా రోజూ సుమారు 400 మందికి ఉదయం నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నట్లు చెప్పారు. గన్నవరంతో పాటు రామవరప్పాడులో మరో అన్న క్యాంటీన్‌ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు వేగంగా మారుతున్నాయని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణంతో గన్నవరం రాజధానికి ప్రధాన ముఖద్వారంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విమానాశ్రయం ఎదురుగా సీ-డాక్‌ కేంద్రాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని యార్లగడ్డ తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేశ్‌ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని, కక్షసాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆర్భాటపు ప్రారంభోత్సవాలు, దొంగ శంకుస్థాపనలు తనకు అలవాటు లేదని, ‘చెప్పిందే చేస్తా.. చేసేదే చెబుతా’ అన్న నిబద్ధతతో పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.