
మహిళను ఒడ్డుకు చేరుస్తున్న వన్‌ ట్రాఫిక్‌ ఆర్‌ఎస్సై శ్రీధర్, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యం విద్యాధరపురం, న్యూస్‌టుడే: అనారోగ్యాన్ని భరించలేక రైవస్‌ కాల్వలో దూకిన యువతిని వన్‌ట్రాఫిక్‌ పోలీసులు స్థానిక యువకుల సహకారంతో ఆదివారం రక్షించారు. సనత్‌నగర్‌కు చెందిన యువతి ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగం చేస్తోంది. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. పేదరికంతో ఆమె సరైన వైద్యం చేయించుకోలేక పోతున్నానన్న ఆవేదనతో ఆదివారం కెనాల్‌ రోడ్డు వినాయకుడి గుడి సమీపంలో రైవస్‌ కాల్వలోకి దూకింది. అదే సమయంలో వన్‌ట్రాఫిక్‌ సీఐ ఉమామహేశ్వరరావు, ఆర్‌ఎస్సై శ్రీధర్, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యం అక్కడ ట్రాఫిక్‌ బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్న కొందరు యువతి కాల్వలోకి దూకిందని కేకలు పెట్టడంతో ఇద్దరు యువకులు తాము ఆ యువతిని రక్షిస్తామని కాల్వలోకి దూకి ఒడ్డుకు తీసుకువచ్చారు. దూకిన సమయంలో ఆమె కాలుకు దెబ్బ తగలడంతో ఆర్‌ఎస్సై శ్రీధర్, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యం ఆమెను భుజానికి ఎత్తుకొని రోడ్డు మీదకు తీసుకువచ్చి ఆటో ఎక్కించి వన్‌టౌన్‌ పోలీసు స్టేషనుకు తరలించారు. వన్‌టౌన్‌ పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిచి వారికి కౌన్సెలింగ్‌ చేసిన అనంతరం అప్పగించారు. వన్‌టౌన్‌ సీఐ గుణరాము, ట్రాఫిక్‌ సీఐ ఉమామహేశ్వరరావు సకాలంలో స్పందించి పోలీసులకు సహకరించిన ఆ ఇద్దరు యువకులతోపాటు ఆర్‌ఎస్సై శ్రీధర్, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.