
చేతిలో నగదు లేకపోయినా జేబులో ఫోన్ ఉంటే చాలు. కిరాణా కొట్టు నుంచి పెద్ద షాపు వరకు యూపీఐతో చెల్లింపులు చేసేస్తున్నాం. టీ కొట్టులో పది రూపాయల నుంచి.. షాపింగ్ మాల్లో వేల రూపాయల వరకు ఫోన్ చూపించి చెల్లించడం ఇప్పుడు మామూలైపోయింది. ఇలాంటి సమయంలో యూపీఐ చెల్లింపులపై కొత్త రుసుము విధానం రానుంది. దీంతో సామాన్యుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకుపైగా అర్హత ఉన్న వ్యాపారి చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ రుసుము వర్తిస్తుంది. అయితే ఈ రుసుము కస్టమర్ నేరుగా చెల్లించాల్సింది కాదు. అంటే దుకాణంలో సరుకులు కొని యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు.. దానికి అదనంగా యూపీఐ రుసుము అని కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయకూడదు. ఎంత రుసుము ? లెక్క చాలా తేలికనే. రూ.2,500 విలువైన వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే 0.4 శాతం ప్రకారం రూ.10 రుసుము లెక్కలోకి వస్తుంది. రూ.5,000 చెల్లిస్తే రూ.20, రూ.10,000 చెల్లిస్తే రూ.40 అవుతుంది. అయితే ఒక్కో లావాదేవీకి రుసుము గరిష్ఠంగా రూ.300 మాత్రమే. అంటే రూ.2 వేలకుపైగా చెల్లించామంటే ప్రతిసారీ రూ.300 కట్టాల్సిన అవసరం లేదు. చెల్లించే మొత్తంలో 0.4 శాతం చొప్పున లెక్క ఉంటుంది. రూ.75 వేలకుపైగా లావాదేవీ జరిగినా గరిష్ఠ రుసుము రూ.300కే పరిమితం. మనవాళ్లకు డబ్బులు పంపితే..! ఇక్కడ సామాన్యుడికి పెద్దగా మార్పు లేదు. కొడుకుకు డబ్బులు పంపినా, అన్నకు పంపినా,...