
Air India Flight : భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. విమానంలోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. ఎయిరిండియా సంస్థకు చెందిన ఏఐ-1886 అనే విమానం మధ్యప్రదేశ్, భోపాల్ నుంచి ఆదివారం ఉదయం ఢిల్లీకి బయల్దేరింది.
ఉదయం 8.25 గంటలకు భోపాల్ నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే, కాస్త ఆలస్యంగా 8.47 గంటలకు బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం ఉదయం 9.55 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. కానీ, విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు మళ్లించాల్సి వచ్చింది. చివరకు 9.40 గంటల సమయంలో జైపూర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని విమానయాన సంస్థ వెల్లడించింది. అయితే, విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ఏంటి అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
విమానాన్ని జైపూర్‌లో ల్యాండ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విమానాల్లో ఇటీవల పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇండిగో విమానానికి కూడా శుక్రవారం ఇలాంటి సాంకేతిక సమస్యే తలెత్తింది. నాగ్‌పూర్ నుంచి విమానం హైదరాబాద్ వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం బయల్దేరిన కాస్సేపటికే ఈ సమస్యను గుర్తించారు. వెంటనే తిరిగి విమానాన్ని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ చేశారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. తర్వాత వేరే విమానంలో వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు.
