
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఎదురుచూపులు ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఓ నిరుపేదకు చెందిన తాత్కాలిక గుడిసె ఇది. ఇందిరమ్మ పథకం మంజూరవుతుందని శిథిల దశలో ఉన్న ఇంటిని కూల్చివేశారు. తీరా గెజిటెడ్‌ అధికారి చిత్రీకరణలో అది ఖాళీ స్థలమని చూపించడంతో ఎంపిక కాలేదు. మళ్లీ ఇలా తాత్కాలిక గుడిసె వేసి ఫొటో తీసి పంపించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ప్రభుత్వం మూడోసారి విధించిన గడువు ముంచుకొస్తోంది. గుడిసెల్లో నివసిస్తున్న వారికే ఇల్లు కేటాయించాలనే నిబంధనతో చాలాచోట్ల అర్హులు దొరకడం కష్టంగా మారిన విషయం తెలిసిందే. కొన్ని సడలింపులు ఇవ్వడంతో లక్ష్యం చేరుకుంటామని అధికారులు భావించినా ఇప్పటికీ సగం వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. రేకుల షెడ్డు, పెంకుటిల్లు ఇతర ఎలాంటి ఆవాసమున్నా తిరస్కరణకు గురవడంతో మొదట్లో కొంత ఆందోళనకు నెలకొంది. ఇంటి బయటా, లోపల ఏఐ ఆధారిత చిత్రీకరణ వలన మట్టిగోడలు ఉన్నా సిమెంటు ఇటుకలు అని చూపించడం, ఇతరత్రా కారణాలతో ఆటంకాలు ఎదురయ్యాయి. అర్హులైన వారిని ఇతరుల (అదర్స్‌) కేటగిరి కింద ఆన్‌లైన్‌లో క్రోడీకరించి ఎంపిక చేయాలని సూచనలు రావడంతో క్షేత్రస్థాయిలో గెజిటెడ్‌ అధికారులు మళ్లీ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. రెండు, మూడుమార్లు సర్వేతో ఈ రకంగానూ ఆలస్యమవుతోంది. మరోపక్క ఎంపికైన వారు ఇల్లు ఎప్పుడు మంజూరవుతుందని మూడు నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. నియోజకవర్గానికి 1500 చొప్పున కేటాయించిన ఇళ్లను మండలాల వారీగా విభజించారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గాల్లో భాజపా, భారాస ఎమ్మెల్యేలు ఉండటంతో అధికారులకు ఒక పరీక్షగా మారింది. ఎమ్మెల్యేల నుంచి ఇన్‌ఛార్జి మంత్రికి పంపిన జాబితాతోపాటు ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్‌ నేతలు ఒత్తిడి తేవడంతో కొన్ని మండలాల్లో రాజకీయపరంగానూ పోటీ ఏర్పడింది. క్షేత్రస్థాయిలో కొన్ని పరిశీలన పూర్తికాగా మరొకొన్నిచోట్ల నేతల జాబితా అధికారులకు అందాల్సి ఉంది. ఎంపికలో ఆలస్యానికి ఇది కారణం అవుతోంది. ఈ విషయమై గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రెడ్డిశంకర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ లోగా ఎంపిక పూర్తిచేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యం పూర్తిచేసి త్వరలో ప్రొసీడింగ్‌లు అందజేయనున్నట్లు వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





