
– ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు నల్లగొండ, సెప్టెంబర్ 15 : బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను బీసీ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. బీసీల సమస్యలపై చట్టసభల్లో తన వాయిస్ ను వినిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యలు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీసీల సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయి ఉద్యమాన్ని కూడా చేపట్టాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 80 ఏండ్లు అయినా సమస్యలు పరిష్కారం కావట్లేదని, పార్టీలకతీతంగా బీసీలు అంతా ఏకమై రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న ఏ వర్గానికి లేని క్రిమిలేయర్ నిబంధన కేవలం బీసీలకే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీసీలకు క్రిమిలేయర్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఏ పోస్టులో జాయిన్ అయితే ఆ పోస్టులోనే రిటైర్డ్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. దేశానికి బీసీ ప్రధాని ఉన్నా బీసీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణనను చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు చింతా నాగరాజు, బీసీ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, పాలిటెక్నిక్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఆంధ్రా బీసీ నాయకులు గిర్రాజ్ రవి, నీలూరి శీనా, యుగంధర్, కిరణ్ పాల్గొన్నారు.