
పాపఘ్నిలో ఇసుకాసురుల ఆగడం నది తీరంలో తిండి గింజలకూ కష్టం వేంపల్లె చెంతన పాపఘ్ని ఒడ్డున మోటారు సాయంతో సాగు చేస్తున్న వరి.. ఇసుక నింపుకొనేందుకు వరుసగా ఉన్న టిప్పర్లు వేంపల్లె, న్యూస్‌టుడే: ఇసుకాసురులు బరి తెగించి వ్యవరిస్తున్నారు. జేబులు నింపుకోవడమే లక్ష్యంగా ఆగడాలు సాగిస్తున్నారు. అన్నదాతల గోడును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. వేంపల్లె సమీపంలోని పాపఘ్ని నదిలో రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. నాలుగు మాసాల క్రితం జూనియర్‌ కళాశాల సమీపంలో మొదలైన ఈ తరలింపు.. ఇప్పుడు ఎద్దుల కొండ గుట్ట వరకు పాకింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ సంవత్సరం మే నెల నుంచి నేటి వరకు పదును వర్షం కూడా నమోదు కాలేదు. మరో పదిహేను రోజులు గడిస్తే ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తుంది. వానల జాడ లేకపోయినా నదీ పరివాహకంలో భూగర్భ జలాల దన్నుతో వేంపల్లె, అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె, కుమ్మరాంపల్లె, వీరన్నగట్టుపల్లె, ఇడుపులపాయ గ్రామాల్లో పాపఘ్నికి ఇరువైపులా దాదాపు 1,400 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. వ్యవసాయ మోటార్లతో తడులు అందిస్తూ తిండి గింజల కోసం రైతులు వరి పంటను కాపాడుకుంటూ వస్తున్నారు. నిన్నటి వరకు భూగర్భ జలాలు బాగానే ఉండగా.. ఇసుక తవ్వకాలతో ఒక్కసారిగా అడుగంటి బోర్లు ఒట్టిపోతున్నాయి. దీంతో వరికి నీటి తడులు అందక ఎండిపోతోంది. ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు భూగర్భ జలాలపై ప్రభావం చూపడంతో వేంపల్లె, కుమ్మరాంపల్లె రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పాపఘ్నిలో విచ్చలవిడి తవ్వకాలే కారణమంటూ ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను మంగళవారం అడ్డుకున్నారు. తవ్వకాలను అడ్డుకోవాలంటూ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా కనీసం అక్టోబరు 31 వరకైనా తవ్వకాలు చేపట్టకుండా చూడాలని అందులో పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.