
చెస్లో దూకుడుగా ఆడడం..ఎత్తుల మీద ఎత్తులు వేసి ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడం ఆమె సహజ లక్షణం. బహుశా అదేనేమో ఆమెను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఆమే విశాఖకు చెందిన యువ చెస్ క్రీడా కారిణి ఎం.సాహితి వర్షిణి. చెస్‌లో దూకుడుగా ఆడడం..ఎత్తుల మీద ఎత్తులు వేసి ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయడం ఆమె సహజ లక్షణం. బహుశా అదేనేమో ఆమెను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఆమే విశాఖకు చెందిన యువ చెస్‌ క్రీడా కారిణి ఎం.సాహితి వర్షిణి . తాజాగా మహిళల గ్రాండ్‌ మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) హోదా దక్కించుకొంది. ఈ నెల 8 నుంచి 14 వరకు సెర్బియాలో జరిగిన టోర్నీ సందర్భంగా ఈ హోదాకు అవసరమైన మూడో నార్మ్‌ సాధించింది. ఈ సందర్భంగా ఆమెతో వసుంధర మాట్లాడింది. మా ది విశాఖపట్నం. అమ్మ జయశ్రీ గృహిణి. నాన్న లోకేశ్వరరావు హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగం చేసేవారు. నా చెస్‌ గురువు ఆయనే. అంతర్జాతీయ పోటీలకు నన్ను సన్నద్ధం చేయడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గతంలో జాతీయ స్థాయి చెస్‌ క్రీడాకారుడిగా రాణించిన నాన్న ప్రోత్సాహంతోనే మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ సాధించగలిగా. అక్క ఫాల్గుణ చెస్‌ ఆర్బిటర్‌గా పనిచేస్తోంది. నాకు ఆరేళ్ల వయసున్నప్పుడు... డెంగీ జ్వరం తీవ్రంగా వచ్చింది. ఆసుపత్రిలో చాలా రోజులు చికిత్స తీసుకున్నా. వైద్యులు సైతం నా పరిస్థితి చూసి కష్టమని చెప్పేశారు. కానీ, అతి కష్టం మీద బతికి బయటపడ్డా. నేను కోలుకోవడాన్ని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఏదో అద్భుతం జరిగిందనీ, బతికావంటే ఏదో సాధించడానికేనని అన్నారంతా. నిజానికి అప్పటికి నాకు చెస్‌ గురించి ఏమీ తెలియదు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రోజులవి. ఆ సమయంలో కాలక్షేపానికి ఫోన్‌లో చెస్‌ ఆడుకోమని నాన్న చెప్పారు. అక్కతో కలిసి ఆడేదాన్ని. ఆటలోని మెలకువలు తనతో పంచుకునేదాన్ని. అవన్నీ గమనించిన నాన్న నాకు మరిన్ని మెలకువలు నేర్పించారు. పోటీలకు తీసుకెళ్లారు. అలా అండర్‌-9 విభాగంలో ఏడున్నరేళ్లకే స్టేట్‌ ఛాంపియన్‌ పోటీల్లో సిల్వర్‌ పతకం సాధించా. అది మొదలు... నాన్నే గురువుగా మారి నన్ను ఆటలో రాటుదేల్చారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా అండగా నిలబడ్డారు. 2017లో ఉమన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ (డబ్ల్యూసీఎం), 2019లో ఉమన్‌ ఫిడే మాస్టర్, 2022లో ఉమన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్, 2023లో ఫిడే మాస్టర్‌ ఇప్పుడు ఉమన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ సాధించా. అంతేకాదు, వివిధ విభాగాల్లో తొమ్మిది అంతర్జాతీయ పతకాలు సాధించా. అండర్‌-10, 12 విభాగాల్లో ఆసియా యూత్‌ చెస్‌ ఛాంపియన్‌ టైటిల్స్‌ సాధించా. థాయ్‌లాండ్‌లో జరిగిన యూత్‌ చెస్‌ ఛాంపియన్‌ పోటీల్లో 6 పతకాలు అందుకున్నా. ఆ పోటీల్లో అందరి కన్నా నేనే చిన్నదాన్ని. కామన్వెల్త్‌ పోటీల్లో అండర్‌-10 విభాగంలో స్వర్ణం గెలుపొందాను. 2022లో చెన్నైలో జరిగిన 44వ ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ జట్టులో అత్యంత పిన్నవయస్కురాలిని నేనే. 2022లో జరిగిన మాగ్నస్‌ చెస్‌ ఛాలెంజ్‌ పోటీల్లో బెస్ట్‌ ఫిమేల్‌ ప్లేయర్‌ అవార్డు దక్కించుకున్నాను. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్నా. అందులో ఇద్దరు అంతర్జాతీయ మాస్టర్లను ఓడించడంతో 30 ఫిడే రేటింగ్‌ పాయింట్లు సంపాదించా. తాజాగా హంగేరీలో నార్మ్‌-2, సెర్బియాలో నార్మ్‌-3 సాధించా. ఈ పోటీలన్నింటిలో పాల్గొని ప్రతిభ చూపడంతో 2,300 క్లాసికల్‌ రేటింగ్‌ను అధిగమించా. 2024లో జరిగిన వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో 13వ స్థానం దక్కించుకున్నా. నా ఆటను చూసి విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రశంసించారు. అది ఎప్పటికీ మరిచిపోలేను. అలానే, థాయ్‌లాండ్‌లో జరిగిన అండర్‌-12 ఛాంపియన్‌షిప్‌ పోటీ కూడా ఎప్పటికీ నాకు ప్రత్యేకమే.ఆ గేమ్‌లో నేను ఆడిన క్వీన్‌ సాక్రిఫికేషన్‌ అద్భుతమని గ్రాండ్‌మాస్టర్‌ జాకబ్‌ ఆగార్డ్‌ ప్రశంసించారు. ప్రస్తుతం 2,324 లైవ్‌ రేటింగ్‌తో కొనసాగుతున్నా. కొవిడ్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఆ తర్వాత పోటీలు లేకపోవడంతో నిరాశకు గురయ్యా. ఇప్పుడీ విజయం నాకెంతో గర్వంగా ఉంది. పోటీలకు ముందు నాన్నకి గుండెపోటు వచ్చినా బాధను దిగమింగుకుని ఆడి గుర్తింపు తెచ్చుకున్నా. రావివలస సురేశ్, విశాఖపట్నం వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు . .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





