© 2026 nimisham.in

పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నప్పుడు మౌంటెనీరింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఇటీవలే తన 43 ఏళ్ల వయసులో యూరప్‌లోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించింది. తద్వారా ‘వయసు సంఖ్య మాత్రమే’ అని నిరూపించి వార్తల్లో నిలిచింది. మరి, వృత్తిరీత్యా యోగా టీచర్ అయిన శివానీకి పర్వతాహరోణ చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? తెలుసుకుందాం రండి.. నిద్ర లేచింది మొదలు ఇంట్లో బాధ్యతలు, కెరీర్ బిజీలో పడిపోయి.. తమ అభిరుచుల్ని సైతం పక్కన పెట్టేస్తుంటారు చాలామంది మహిళలు. కానీ కొందరు మాత్రం కాస్త లేటు వయసులోనైనా వీటిపై దృష్టి పెడుతూ తమను తాము నిరూపించుకుంటారు.. ఇతరులకు స్ఫూర్తినిస్తుంటారు. శివానీ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఉత్తరప్రదేశ్ సీతాపుర్‌కు చెందిన ఆమె.. వివాహం తర్వాత లక్నోలో స్థిరపడింది. పెళ్లయ్యాక గృహిణిగా, అమ్మగా బిజీగా మారిపోయింది. స్వతహాగా ఫిట్నెస్ లవర్ అయిన ఆమె.. సాహసాలు చేయడానికీ మక్కువ చూపుతుంది. ఈ ఇష్టమే తనను పర్వతారోహణ వైపు అడుగులేసేలా చేసిందంటోంది శివానీ. ‘ఓసారి స్నేహితులతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కింగ్‌కి వెళ్లా. అప్పుడే నాకు పర్వతారోహణ పరిచయమైంది. ఈ అనుభవాన్ని ఎంతో ఎంజాయ్ చేశా. ఇక ముందూ మౌంటెనీరింగ్ చేయాలన్న కోరిక నాలో మొదలైంది. ఈ క్రమంలోనే కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు
పర్వతాల్ని అధిరోహించా. అయితే పర్వతారోహణకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు కానీ.. ఇలా చిన్న చిన్న పర్వతాల్ని ఎక్కుతూనే ఇందులో ప్రాథమిక మెలకువలు నేర్చుకున్నా..’ అంటోన్న ఈ మౌంటెనీర్ ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన శిఖరాల్ని అధిరోహించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది.
నాలుగు పదుల వయసు దాటాక ‘7-సమిట్ ఛాలెంజ్’ని ప్రారంభించింది శివానీ. ఇందులో భాగంగా ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ కిలిమంజారోను అధిరోహించిన ఆమె.. ఇటీవలే రష్యాలోని ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్పై కాలు మోపింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ ఫీట్ పూర్తి చేయడం థ్రిల్లింగ్‌గా ఉందంటోంది శివానీ.
‘కొంతమంది వయసులో ఉన్నప్పుడు సాహసాలు చేయలేకపోయానే అని బాధపడుతుంటారు. కానీ మన అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి, లక్ష్యాల్ని చేరుకోవడానికి వయసు సంఖ్య మాత్రమే అని నేను భావిస్తా. అందుకే 40 దాటాక నా పర్వతారోహణ ప్రయాణాన్ని మొదలుపెట్టా. ప్రస్తుతం 43 ఏళ్ల వయసులో ఎల్బ్రస్ పర్వతారోహణ పూర్తిచేశా. అయితే ఈ క్రమంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఎడతెరపి లేని వర్షం, మంచు కురవడం, బలమైన శీతల గాలులు.. వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు మధ్యమధ్యలో ఆటంకం కలిగించినా.. ఇక నా వల్ల కాదు.. అనిపించినప్పుడల్లా.. ‘నా జర్నీ ఇప్పుడే మొదలైంది..’ అనుకునేదాన్ని. ఈ సానుకూల దృక్పథంతోనే నాలుగున్నర గంటల్లోనే శిఖరాగ్రానికి చేరుకున్నా..’ అంటోన్న ఆమె.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన తదుపరి లక్ష్యమంటోంది.
వయసులో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, కూతురి పెంపకంలో బిజీగా గడిపిన శివానీ.. గత ఆరేళ్లుగా తన అభిరుచులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పర్వతారోహణతో పాటు తనకెంతో ఇష్టమైన యోగా చేస్తూనే, అల్ట్రా-రన్నింగ్‌లోనూ పాల్గొంటోంది. ప్రస్తుతం ఇటు మారథాన్లతో పాటు అటు వివిధ పరుగు పందేల్లోనూ పోటీపడుతోంది. అడ్వాన్స్డ్ యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా సర్టిఫికేషన్ పొందిన శివానీ.. గత ఆరేళ్లుగా ఔత్సాహికులకు యోగా పాఠాలూ చెబుతోంది. అంతేకాదు.. గర్భిణులు, బాలింతలు, క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేకంగా యోగా కార్యక్రమాల్నీ డిజైన్ చేస్తోంది.
‘యోగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాదు.. మనసునూ ఉత్తేజితం చేస్తుంది. అందుకే చిన్నతనం నుంచే ఇది నా జీవనశైలిలో ముఖ్య భాగమైంది. ప్రస్తుతం యోగాతో పాటు ఇతర జిమ్ వ్యాయామాలూ సాధన చేస్తున్నా. రోజూ ట్రెక్కింగ్ సాధన కోసం కొంత సమయం కేటాయిస్తా. యోగా శిక్షకురాలిగా నేను సంపాదించే డబ్బును పర్వతారోహణ కోసం ఖర్చు చేస్తున్నా. ఇలా నా పట్టుదలకు కుటుంబ ప్రోత్సాహం కూడా తోడైంది.. అందుకే నా అభిరుచుల్ని నెరవేర్చుకోగలుగుతున్నా..’ అంటోన్న శివాని.. సవాళ్లను దాటుకొని ముందుకు సాగినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలమంటోంది. తాను చేసే యోగా, పర్వతారోహణకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని తరచూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.