
తేలు విషం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవ పదార్థాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే.. ఒక గ్రాము తేలు విషం ధర ఇప్పుడు సుమారు రూ.8లక్షల 60వేల దాకా ఉంది. కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కొన్ని రకాల తేలు విషానికి ఒక లీటర్‌కు దాదాపు 80 కోట్ల రూపాయలకుపైగా విలువ ఉంటుందని చెబుతున్నారు. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉంది. అసలు తేలు విషానికి ఇంత ధర ఎందుకు? ఆ విషంతో ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా తేలు విషానికి ఇంత భారీ ధర ఎందుకు ఉంటుందో చూద్దాం. నిజానికి తేలు నుంచి వచ్చే విషం పరిమాణం చాలా చాలా తక్కువ. కొన్ని జాతుల తేళ్ల నుంచి ఒకసారి సేకరించే విషం కేవలం కొన్ని మిల్లీగ్రాముల స్థాయిలోనే ఉంటుంది. చాలా తేళ్ల నుంచి విషాన్ని సేకరించినా.. కొన్ని చుక్కల మొత్తంలో మాత్రమే విషం లభిస్తుంది. అందుకే ఈ విషాన్ని సేకరించడానికి పెద్ద సంఖ్యలో తేళ్లను పెంచాల్సి ఉంటుంది. తక్కువ పరిమాణంలో లభించడం, సేకరణ ప్రక్రియ కష్టంగా ఉండటం.. ఇవే దాని విలువ పెరగడానికి ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ విషాన్ని సేకరించే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తేళ్లను ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెంచి, వాటి విష గ్రంథుల నుంచి విషాన్ని జాగ్రత్తగా సేకరిస్తారు. ఈ ప్రక్రియను సాధారణంగా వెనమ్ మిల్కింగ్ అని అంటారు. తేలు చనిపోకుండా విషాన్ని సేకరించడం ఇందులో ముఖ్యమైన విషయం. అంటే ఒకసారి విషం తీసుకున్న తర్వాత ఆ తేలును వదిలేయడం కాదు. దాన్ని సంరక్షిస్తూ.. కొంతకాలం తర్వాత మళ్లీ విషాన్ని సేకరించేలా చూస్తారు. అందుకే ఈ పనికి నైపుణ్యంతో పాటు చాలా ఓపిక కూడా అవసరం. మరి ఇంత కష్టపడి సేకరించే తేలు విషాన్ని అసలు ఏం చేస్తారు? ఇదే ఈ స్టోరీలో అత్యంత ఆసక్తికరమైన విషయం. తేలు విషం మనకు ప్రాణాంతకంగా అనిపించినా.. శాస్త్రవేత్తలకు మాత్రం భవిష్యత్తు ఔషధాల కోసం ఉపయోగపడే ఒక విలువైన వనరుగా మారింది. ముఖ్యంగా, మూడు ప్రధాన వైద్య రంగాలు ఈ విషాన్ని ఉపయోగిస్తున్నాయి. వాటిలో నంబర్ వన్. క్యాన్సర్ ట్రీట్మెంట్. తేలు విషంలోని కొన్ని భాగాలు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటి పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇది కొత్త, లక్ష్యంగా చేసుకునే క్యాన్సర్ చికిత్సలకు ఆధారం కావచ్చు.రెండోది. మూర్ఛ.. ఫిట్స్ వంటి నాడీ సంబంధిత పరిస్థితులకు చికిత్స చేయడానికి తేలు విషం నుంచి తీసిన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇక 3. నొప్పి నుంచి ఉపశమనం : దీర్ఘకాలిక నొప్పి, నొప్పి సంబంధిత పరిస్థితులకు ఉపశమనం కలిగించే శక్తివంతమైన నొప్పి నివారిణిగా దీనిని ఉపయోగిస్తారు. ఈ రకమైన ఔషధాల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థం కావడంతో, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో తేలు విషానికి ఉన్న డిమాండ్ స్థిరంగా అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను తీర్చడం కోసం వందల వేల తేళ్లను పెంచడం తప్పనిసరి అవుతుంది. నిజానికి, తేలు విషం విలువ దాని పరిమాణంలో లేదు.. అందులో దాగి ఉన్న ప్రత్యేకమైన పదార్థాల్లో ఉంది. ఎందుకంటే తేలు విషంలో అనేక రకాల ప్రొటీన్లు, పెప్-టైడ్లు, ఇతర బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయి. వీటిలో కొన్ని మన శరీరంలోని కణాలు, నాడీ వ్యవస్థపై ఎలా పనిచేస్తాయో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా, ప్రాణాంతక వ్యాధి అయినా.. క్యాన్సర్ పరిశోధనలో, తేలు విషంలోని కొన్ని పదార్థాలను విరుగుడుగా భావిస్తున్నారు. తేలు విషంలో ఉండే కొన్ని అణువులు క్యాన్సర్ కణాలను గుర్తించడంతో పాటు, వాటి పెరుగుదలను అడ్డుకుని, క్యాన్సర్ కు చెక్ పెట్టగలవా? అనే అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తేలు విషంలోని అణువులను విడదీసి, వాటి లక్షణాలను అర్థం చేసుకుని, సురక్షితంగా ఉపయోగించగలమా అనే దానిపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అందుకే ఫార్మా, బయోటెక్, మెడికల్ రీసెర్చ్ రంగాల్లో తేలు విషంపై ఆసక్తి పెరుగుతోంది. మరి భారత్‌లో పరిస్థితి ఏంటి? మన దేశంలో కూడా అనేక రకాల తేళ్లు ఉన్నాయి. వాటి విషంపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కొన్ని భారతీయ పరిశోధనా సంస్థలు తేలు విషంలోని పదార్థాలను అధ్యయనం చేశాయి. అయితే విదేశాల్లో కనిపించే స్థాయిలో తేలు విషాన్ని భారీ వాణిజ్య పరిశ్రమగా మార్చడం మాత్రం ఇంకా పెద్ద స్థాయిలో కనిపించడం లేదు. భవిష్యత్తులో ఈ రంగంలో పరిశోధనలు, బయోటెక్నాలజీ అభివృద్ధి పెరిగితే.. మన దేశంలో కూడా దీనికి అవకాశాలు ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. అదేవిధంగా.. టర్కీ, చైనా, నైజీరియా వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో తేళ్లను పెంచుతూ వాటి నుంచి విషాన్ని సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి.. మనం ప్రమాదకరమైన విషంగా చూసే తేలు విషం వెనుక ఇంత పెద్ద శాస్త్రీయ కారణం ఉంది. ఒక చిన్న తేలు నుంచి వచ్చే కొన్ని చుక్కల విషం.. పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉండటమే దాని ప్రత్యేకత. అందుకే కొన్ని రకాల తేలు విషానికి మార్కెట్లో కోట్ల రూపాయల విలువ ఉంది. అయితే ఈ ధర అన్ని తేళ్ల విషానికీ ఒకేలా ఉండదు. తేలు జాతి, విషంలోని పదార్థాలు, నాణ్యత, పరిశోధన , మార్కెట్ డిమాండ్.. ఇలా చాలా విషయాలపై దాని విలువ ఆధారపడి ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వైభవ్ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా? పాకిస్థాన్‌కు వసీం అక్రమ్ చురకలు వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”.. వేలంలో కళ్లుచెదిరే రేటు! ఇక గోరింటాకు కూడా మెషీన్‌తోనే.. మరికొన్ని ఉద్యోగాలు హుష్! పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!