విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. నగరంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో హంగర్ ఫ్రీ వైజాగ్ పేరుతో కమ్యూనిటీ ఫ్రిజ్‌లకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 15న నగరంలో ఐదుచోట్ల ఫ్రిజ్‌లతో ఈ ఫుడ్ బ్యాంకుల్ని ప్రారంభించబోతున్నారు. నగరంలోని హోటల్స్, కేటరింగ్ నిర్వాహకులుతో పాటుగా ఎవరైనా ప్రత్యేక సందర్భాల్లో ఫుడ్ డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చేవారి సహకారంతో వీటిని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి ఐదుచోట్లు ప్రారంభిస్తున్నా.. రాబోయే రోజుల్లో నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.ఈ నెల 15న నగరంలోని రైల్వే స్టేషన్, జగదాంబ జంక్షన్, ద్వారకానగర్ బస్‌స్టేషన్, మద్దిలపాలెం, గాజువాక ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ ఐదుచోట్ల ప్రత్యేకంగా ఒక షెడ్ ఏర్పాటు చేసి.. అక్కడ ఓ రిఫ్రిజిరేటర్‌ను అందుబాటులో ఉంచుతారు. అక్కడ నాణ్యమైన, తాజా ఆహారాన్ని అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేశారు. ప్రతిరోజూ హోటల్స్, కేటరింగ్ నిర్వాహకుల సాయంతో మూడు పూటలా ఆహారాన్ని అక్కడ ఉంచుతారు. ఆయా ప్రాంతాల్లో ఇలా ఫుడ్ బ్యాంకులకు ఆహారం అందించేవారిని గుర్తించారు. ఒకవేళ ఎవరైనా బర్త్ డే, పెళ్లిరోజు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో ఫుడ్ పంపిణీ చేయాలనుకుంటే.. ఫుడ్‌బ్యాంక్ ద్వారా అవసరమైన వారికి అందజేస్తారు. మిగిలిపోయిన, పాడైపోయిన, సగం తినేసి వదిలేసిన ఆహారాన్ని తీసుకురావద్దని బోర్డులు ఏర్పాటు చేస్తారు.ఈ ఫుడ్‌బ్యాంకులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతల్ని స్థానికంగా ఉండే కంట్రోల్ రూమ్ సీఐలకు సీపీ అప్పగించారు. ఒకవేళ ఎవరైనా ఫుడ్ బ్యాంకుకు ఆహారం అందజేయాలి అనుకుంటే స్థానికంగా ఉండే పోలీసుల్ని, ప్రత్యేకంగా ఒక మొబైల్ నంబర్ కేటాయించి ఫుడ్ బ్యాంకుల దగ్గర బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఆకలితో ఇబ్బందిపడేవారికి ఈ ఫుడ్ బ్యాంకులు ఎంతో ఉపయోగంగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే ఈ హంగర్ ఫ్రీ వైజాగ్ పేరుతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం సీపీ శంఖబ్రతబాగ్చి ఆలోచనపై విశాఖవాసులు ప్రశంసలు కురిపిస్తు్న్నారు