
VietJet Water Controversy : బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో సేవలు, కనీస మానవతా దృక్పథంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అనారోగ్యంతో ఉన్న తన తల్లి మందులు వేసుకోవడానికి కనీసం ఒక గ్లాసు మంచి నీళ్లు ఇవ్వడానికి కూడా వియత్జెట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించారని ఒక ప్రయాణికుడు ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.మందులు వేసుకోవడానికి నీళ్లడిగితే.. కొనుక్కొమ్మన్న సిబ్బంది!బాధితుడు యదుప్రియం మెహతా తెలిపిన వివరాల ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆయన తల్లికి వైద్యులు సూచించిన మందులు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ట్యాబ్లెట్లు వేసుకోవడానికి కొద్దిగా నీళ్లు కావాలని క్యాబిన్ సిబ్బందిని అడగ్గా.. ఉచితంగా నీళ్లు ఇవ్వడం కుదరదని, విమానంలో లభించే మెనూ నుంచి నీళ్ల సీసాను కొనుగోలు చేయాల్సిందేనని సిబ్బంది తేల్చి చెప్పారు. ఆ సమయంలో తమ వద్ద సదరు స్థానిక కరెన్సీ లేదా నగదు లేదని, తల్లి ఆరోగ్యం దృష్ట్యా అత్యవసరంగా మందు వేసుకోవాలని ఎంత వేడుకున్నా సిబ్బంది వినకపోగా వివాదాన్ని మరింత పెద్దది చేశారని మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవాన్ని వివరిస్తూ.. మెహతా సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. "వియత్జెట్ విమానాల్లో ప్రయాణించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఏ ప్రయాణికుడికీ ఇలాంటి అమర్యాదకర ప్రవర్తన ఎదురవ్వకూడదు. నా తల్లి పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర నిరాశకు గురిచేసింది. సాధారణ అభ్యర్థనను కూడా అనవసర వివాదంగా మార్చి, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు" అని ఆయన పేర్కొన్నారు.విమానయాన సంస్థల నిబంధనలపై చర్చ..!ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రయాణికుల హక్కులు, విమానయాన సంస్థల నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఒక వర్గం ప్రయాణికుడికి మద్దతు తెలుపగా, మరొక వర్గం ఎయిర్‌లైన్స్ సిబ్బంది వైపే నిలిచింది. వైద్య అత్యవసర సమయాల్లో.. మందులు వేసుకోవడానికి కనీస తాగునీరు అందించడం విమానయాన సంస్థల ప్రాథమిక బాధ్యత అని, బడ్జెట్ ఎయిర్‌లైన్స్ అయినా సరే కనీస మానవత్వాన్ని ప్రదర్శించాలని పలువురు కామెంట్లు చేశారు. మరోవైపు మరికొందరు ప్రయాణికుడి తీరును తప్పుపట్టారు. "ఉచితంగా వస్తువులను ఆశించడం ఆపేయండి. బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మీ నీళ్ల సీసా మీరే తెచ్చుకోవాలి లేదా కొనుక్కోవాలి. తక్కువ ధర టికెట్లు కొని ఎమిరేట్స్ స్థాయి సేవలు ఆశించడం సరికాదు" అని ఘాటుగా స్పందించారు.సిబ్బంది చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారని, ప్రయాణికుడే అనవసరంగా కేకలు వేస్తూ గొడవ చేశారని కొందరు నెటిజన్లు విమర్శించారు. ఏది ఏమైనా బడ్జెట్ విమానాల్లో లభించే సేవలు, సిబ్బంది ప్రవర్తనపై ఈ ఘటన మరోసారి ఆలోచనల్లో పడేసింది