నైజం. తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయడానికే తపించారు జానకి - ఇది నిజం. భక్తిరస పాత్రలు పోషించే సమయంలో జానకి ఎంతో నిష్టగా ఉండేవారు. ఆ పాత్రలను రక్తి కట్టించేవారు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు షావుకారు జానకి. తమిళ చిత్రాలలోనే ఎక్కువగా హీరోయిన్ వేషాలు వేశారు. తెలుగు చిత్రాల్లో అనేక వైవిధ్యమైన పాత్రలు ధరించి ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు జానకి. కొన్ని పాత్రల్లో జానకిని తప్ప ఇతరులను ఊహించుకోలేం. 'మంచి మనసులు'లో అంధురాలిగా ఆమె నటించిన వైనాన్ని మరచిపోలేం.
తన సొంత చెల్లెలు కృష్ణకుమారి ఆగమనంతో జానకికి తెలుగులో నాయిక పాత్రలు తగ్గాయి. అయినా వెరవలేదు. తన మనసుకు నచ్చిన కేరెక్టర్ దొరికితే చాలు ఎంతో పొంగిపోయేవారు జానకి. పలు చిత్రాల్లో బరువైన పాత్రలు పోషించి మెప్పించారు జానకి. 'కన్యాశుల్కం'లో బుచ్చమ్మ పాత్రలో జానకి వెండితెరపై జీవించారు. ఇక 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం'లో ఎరుకల సానిగా జానకి అభినయాన్ని ఈ నాటికీ జనం మరచిపోలేదు. వయసు మీద పడ్డా అందుకు తగ్గ పాత్రల్లో షావుకారు జానకి తనదైన బాణీ పలికించారు. యాభై ఏళ్ళు దాటాక కూడా 'తాయారమ్మ- బంగారయ్య' చిత్రంలో జానకి అభినయించిన తీరు చూసి ఆ నాటి యంగ్ హీరోయిన్స్ సైతం ఆశ్చర్యపోయారు. 'తాయారమ్మ'గా జానకి నటన ప్రేక్షకులను ఎంతగానో రంజింప చేసింది.
నటరత్న యన్టీఆర్ తో షావుకారు జానకి 'చిత్ర'బంధం ప్రత్యేకమైనది. ఎందుకంటే యన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'షావుకారు'. అలా యన్టీఆర్ తొలి హీరోయిన్ జానకి. అలాగే ఆమెకు తొలి కథానాయకుడు యన్టీఆర్. వారి జంట అనేక చిత్రాల్లో ప్రేక్షకులకు కనుల పండగ చేసింది. తన తొలి హీరోయిన్ కావడంతో యన్టీఆర్ షావుకారు జానకిని ఎంతగానో గౌరవించేవారు. ఆ గౌరవం కడదాకా సాగింది. యన్టీఆర్ తొలి సొంత చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో ఆమె ఓ నాయికగా నటించారు. అందులో జానకి జోడీగా అమర్ నాథ్ నటించారు. అదే సినిమాలో యన్టీఆర్ కు జంటగా జానకి సొంత చెల్లెలు కృష్ణకుమారి అభినయించారు. యన్టీఆర్ తమ 'యన్.ఏ.టి.' బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి కుడివైపు జానకిని లక్ష్మీదేవిగా కూర్చుండబెట్టి చూపించారు. 'యన్.ఏ.టి.'వారి 'పాండురంగ మహాత్మ్యం' నుంచీ ఈ లోగోలో జానకి కనిపించడం మొదలయింది. తన తొలి కథానాయిక జానకిని ఓ దేవతామూర్తిగా గౌరవించారు యన్టీఆర్. యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో లక్ష్మీదేవిగా కనిపించిన షావుకారు జానకి అంటే యన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావుకు కూడా ఎంతో గౌరవం. తాను స్వస్తిశ్రీ బ్యానర్ పై నిర్మించిన 'రేచుక్క-పగటిచుక్క' సినిమాలో జానకినే నాయికగా ఎంచుకున్నారు త్రివిక్రమరావు. అందులోనూ యన్టీఆర్, జానకి జంట ప్రేక్షకులను అలరించింది. యన్టీఆర్ సరసన జానకి నటించిన "వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంతవూరు, జయం మనదే, కాడెద్దులు ఎకరం నేల, పెంపుడు కూతురు, సవతి కొడుకు, దేశద్రోహులు" వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందు నిలిచాయి. ఇక యన్టీఆర్ నటించిన అనేక సినిమాల్లో జానకి కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. యన్టీఆర్ ను జానకి దైవాంశ సంభూతునిగానే భావించేవారు.
నటసమ్రాట్ ఏయన్నార్ తోనూ షావుకారు జానకి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షకులను ఏయన్నార్- జానకి జంట సైతం ఎంతగానో అలరించింది. నటసమ్రాట్ ఏయన్నార్ తో జానకి నాయికగా నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. అయినా సదరు చిత్రాల్లో జానకి ఎంతో వైవిధ్యమైన పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. వారిద్దరూ నటించిన చిత్రాల్లో 'రోజులు మారాయి, మంచి మనసులు, అక్కాచెల్లెళ్ళు, మంచి కుటుంబం" జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఏయన్నార్- జానకి జంటను తలచుకోగానే ఆ నాటి ఫ్యాన్స్ కు చప్పున గుర్తుకు వచ్చేది 'అక్కాచెల్లెళ్ళు' సినిమా. అందులో 'పాండవులు పాండవులు తుమ్మెదా.' సాంగ్ లో జానకి చలాకీ నటన ప్రేక్షకులను ఎంతగానో రంజింప చేసింది. ఏయన్నార్ జోడీగా జానకి నటించిన 'డాక్టర్ చక్రవర్తి'లో ఆమెది కథను మలుపు తిప్పే కీలక పాత్ర. ఆ కేరెక్టర్ లో జానకి ప్రదర్శించిన నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో కొన్ని సన్నివేశాల్లో జానకి చిలిపితనంతోనూ మురిపించడం విశేషం. పలు విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసిన షావుకారు జానకి చిత్రసీమలో లాంగ్ జర్నీ చేశారు. 94 ఏళ్ళ సుదీర్ఘ జీవితాన్ని చూసిన జానకి తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో అనేక వైవిధ్యమైన పాత్రల్లో జీవించారు షావుకారు జానకి. కొత్తగా చిత్రసీమలో ప్రవేశించిన వారికి జానకి సరైన సలహాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను జానకి తు.చ. తప్పక పాటించారు. మద్రాసులో జానకి అందమైన భవంతులు కట్టుకున్నారు. జానకి ఇంట్లో షూటింగ్స్ జరుపుకున్న అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఎంతో సుదీర్ఘ నటనా ప్రస్థానం సాగించిన షావుకారు జానకికి ఒక్క 'పద్మ' అవార్డూ రాలేదని అభిమానులు వాపోయేవారు. ఆమె మాత్రం ఏ నాడూ బాధపడలేదు. రాసి పెట్టి ఉంటే తప్పకుండా వస్తుందనేవారు. ఆమె సంకల్పబలమేమో కానీ 90 ఏళ్ళు దాటిన తరువాత 2022లో షావుకారు జానకి 'పద్మశ్రీ' పురస్కారం అందుకోవడం విశేషం. షావుకారు జానకి మనవరాలు వైష్ణవి కూడా నటిగా సాగారు. 'ప్రేమ', 'పరువు-ప్రతిష్ఠ', 'శుభసంకల్పం' వంటి చిత్రాల్లో వైష్ణవి నటించారు. ఏది ఏమైనా షావుకారు జానకి తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించారు. మరపురాని మహానటి షావుకారు జానకి తెలుగు పలుకు ఉన్నంత వరకూ నిలచే ఉంటారు. ఆమె నటన భావితరాలకు పాఠ్యాంశాలుగా నిలుస్తాయని చెప్పవచ్చు.