© 2026 nimisham.in

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని
నిలబెట్టుకోవడం కోసం మరింత బాధ్యతగా పని చేస్తాను. త్రివిక్రమ్ గారి 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సంభాషణలు సరదాగా ఉంటూనే, జీవిత సత్యాలు చెబుతాయి. ఆ సినిమా నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆ తరహా రచన రాయడానికి ఇష్టపడతాను.
అసలు ‘విశ్వనాథ్ & సన్స్’ కథ ఎలా పుట్టింది? వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలని మొదట అనుకున్నాను. 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలి. దాని చుట్టు అల్లుకున్న కథ ఇది. నా దృష్టిలో మనుషులు చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే విషయాన్ని సినిమాలో చెప్పడం జరిగింది. ఈ కథ నేను 2022 లోనే అనుకున్నాను. అప్పుడు సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని రాయలేదు. సూర్య గారికి నచ్చిన తర్వాత, ఆయన బాడీ ల్యాంగ్వేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది.
సినిమాలో ఆర్ట్ వర్క్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇంటి సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై ఎలాంటి హోంవర్క్ చేశారు? నేను, మా ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, డీఓపీ నిమిష్ ముగ్గురం కూర్చొని దీని గురించి చర్చించుకున్నాం. ఇల్లు అనగానే విశాలంగానే కాదు, కొత్తగా ఉండాలి అనుకున్నాం. రిచ్ నెస్ కనిపిస్తూనే, కొత్తదనం కనిపించాలి అనుకున్నాము.
‘విశ్వనాథ్ & సన్స్’ చూసి త్రివిక్రమ్ గారి రియాక్షన్ ఏంటి? త్రివిక్రమ్ గారికి సినిమా చాలా నచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందే సినిమాల నిర్మాణంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, దాదాపు అన్ని సినిమాలు చూస్తుంటారు. అయితే త్రివిక్రమ్ గారు సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచిస్తూ ఉంటారు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం.. ఎలాంటి మార్పులు చెప్పకుండా, చాలా బాగుంది అన్నారు.
ఈ సినిమా విషయంలో ఎడిటింగ్ ప్రభావం ఎంత ఉంది? నా దృష్టిలో ఏ సినిమా అయినా ఎడిట్ టేబుల్ మీద బెటర్ అవుతుంది. మనం తీసిన ప్రతిదీ సినిమాలో ఉండాలి అనుకోకుండా, ఎడిటర్ కి స్వేచ్ఛ ఇస్తే.. ఖచ్చితంగా మంచి అవుట్ పుట్ వస్తుంది. ‘విశ్వనాథ్ & సన్స్’ విషయంలోనూ అదే జరిగింది.
తమిళ వెర్షన్ లో షూట్ చేశారు కానీ, తెలుగులోనే ఎక్కువ వసూళ్లు వస్తుండటంపై మీ అభిప్రాయం? సూర్య గారి మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని తమిళంలో చిత్రీకరించాము. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ. టికెట్ ధరలలో కూడా వ్యత్యాసం ఉంది. అందుకే అక్కడ వసూళ్లు తక్కువ వచ్చాయని అనిపిస్తుంది. కానీ, మన దగ్గరతో పోలిస్తే అక్కడ లాంగ్ రన్ ఉంటుంది. కరుప్పు విషయంలో అదే జరిగింది. ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా లాంగ్ రన్ లో తమిళంలో భారీ వసూళ్లు సాధిస్తుంది.
మమితా బైజు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు? ప్రేమలు సినిమా చూసి ఈ పాత్రకు మమితా బైజు సరిపోతుంది అనిపించింది. ఆమెకు తమిళం మీద కూడా పట్టుంది. కామెడీ చేయాలంటే భాష మీద పట్టుండాలి. అదే విషయాన్ని రుజువు చేస్తూ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు మమిత.
వరుసగా సితార బ్యానర్ లోనే సినిమాలు చేయడానికి కారణం? డబ్బు, అగ్రిమెంట్ లకు అతీతమైన బంధం సితార బ్యానర్ తో ఏర్పడింది. నన్ను నమ్మి అవకాశమిచ్చిన ఆ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాలకు ఈ స్థాయి వసూళ్లు వస్తుండటంపై మీ అభిప్రాయం? ఒకప్పుడు అన్ని రకాల జానర్ సినిమాలు వచ్చేవి. కానీ, గత కొన్నేళ్లుగా ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే ఒక మంచి ఫ్యామిలీ సినిమా వస్తే, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
Vishwanath And Sons, Venky Atluri, Suriya, Mamitha Baiju
'ఇరుముడి' బిజినెస్: రవితేజ ఖాతాలో హిట్ పడాలంటే అన్ని కోట్లు రాబట్టాలి.!
ఆర్జీవీకి షాక్, 'పోలీస్ కంపెనీ' షూటింగ్‌ను ఆపేసిన టెక్నీషియన్స్.. ఏం జరిగింది?
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.