© 2026 nimisham.in

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిన్న వరలక్ష్మీ వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఇక్కడ అష్టలక్ష్మి మంటపాన్ని కూడా ఎంతో శోభాయమానంగా అలంకరించారు. ఇక సాయంత్రం వేళ వైభవంగా స్వర్ణ రథోత్సవం కూడా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అమ్మవారికి సహస్రనామార్చన, నిత్యార్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించబడి భక్తులకు దివ్యదర్శనాన్ని ఇచ్చారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆస్థాన మండపంలో పద్మ పీఠంపై ప్రతిష్టించారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి, రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి వంటి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. మొత్తం 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి, మహా మంగళ హారతితో వ్రతాన్ని ముగించారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం, దీర్ఘ మాంగల్యం, సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమని పండితులు పేర్కొంటున్నారు. టీటీడీ ఉద్యానవన విభాగంలోని 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి, సుమారు మూడు టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 14 రకాల కట్ ఫ్లవర్స్‌తో ఆలయం, ఆస్థాన మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మంటపాన్ని మోసంబి, పైనాపిల్, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లతో, పూలతో అందంగా తీర్చిదిద్దారు. మంటపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలను కనులారా చూడాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏడు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు
. వరలక్ష్మి వ్రతాన్ని వీక్షించేందుకు ఆస్థాన మంటపం, పుష్కరిణి, వాహన మండపం, తోలప్ప గార్డెన్ గేట్ నెంబర్ 3 ప్రాంతాల్లో కూడా స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై ఆలయ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ స్వర్ణ రథోత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, నాలుగు వీధుల్లో రథం వెళ్తున్నప్పుడు కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు.