
జామ్‌నగర్: అనంత్ అంబానీ స్థాపించిన వంతారా మరింతగా విస్తరిస్తోంది. తన సంరక్షణ కార్యక్రమాల్ని ప్రపంచ దేశాలకూ విస్తృతం చేస్తోంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గజరాజులకు రక్షణ పట్ల వంతారా తన నిబద్ధతను చాటుతోంది. అనంత్ అంబానీ రక్షించిన మొదటి ఏనుగు గౌరితో వంతారా ప్రయాణం మొదలై.. ప్రస్తుతం ఇక్కడ 260 ఆసియా ఏనుగులు ఉన్నాయి. తద్వారా ప్రపంచంలో అగ్రగామి ఏనుగు కేంద్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ‘‘నా హృదయంలో, వంతారా ప్రయాణంలోనూ ఏనుగులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. మేం సంరక్షించే ప్రతి ఏనుగుకూ ఒక ప్రత్యేక కథ ఉంది. ప్రతి రక్షణ చర్య వాటి సంక్షేమం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది. గౌరిని రక్షించడంతో ప్రారంభమైంది. ఇప్పుడు ఏనుగు సంక్షేమాన్ని మెరుగుపరచడం, వాటిని చూసుకునే వ్యక్తులకు తోడ్పాటు ఇవ్వడం, భాగస్వాములతో జ్ఞానాన్ని పంచుకోవడం, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఏనుగు సంరక్షణకు తోడ్పడటం వంటి చర్యలను విస్తృతం చేస్తున్నాం. ప్రపంచ ఏనుగు దినోత్సవం సందర్భంగా వాటికి మరింత మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం’’ అని అనంత్ అంబానీ అన్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ హాథీ గావ్‌లో ఏనుగుల సంరక్షణ, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాజస్థాన్ అటవీ శాఖతో కలిసి వంతారా పనిచేయనుంది. ఇందులో భాగంగా అధునాతన ఆసుపత్రి, పోషకాహార కేంద్రం, హైడ్రోథెరపీ సౌకర్యంతో కూడిన అత్యాధునిక చికిత్స, ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే వృద్ధ ఏనుగుల కోసం ప్రత్యేక కేర్ సెంటర్లు ఉంటాయి. ఇటీవల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవుల్లోని ఎనిమిది ప్రాంతాల్లో రాష్ట్ర అటవీ శాఖల భాగస్వామ్యంతో వంతారా విస్తృతమైన ఏనుగు సంరక్షణ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. ఆయా రాష్ట్రాల అటవీ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 182 ఏనుగులకు సేవలు అందించనున్నారు. 242 మంది మావటీలకు శిక్షణ ఇచ్చారు. ఏనుగుల ఆరోగ్యం, వాటిపట్ల మానవీయతతో వ్యవహరించడం, ప్రథమ చికిత్స నిర్వహణ