© 2026 nimisham.in
Judge Ravi Kumar Diwakar : ఉత్తరప్రదేశ్ న్యాయశాఖలో ఎవరూ ఊహించని ఓ కీలక పరిణామ చోటు చేసుకుంది. ముజఫ్ఫర్ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను ఇతర న్యాయమూర్తికి బదిలీ చేశారు. అయితే ఈయన గడిచిన నాలుగు నెలల వ్యవధిలోనే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నిందితులకు మరణశిక్ష విధిస్తూ ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు. ఈక్రమంలోనే 100 కేసులు బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా న్యాయవాదులు, వ్యాజ్యదార్లలో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కేసులు బదిలీకి కారణమిదే..!ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన కేసులను జడ్జి రవికుమార్ దివాకర్ బెంచ్ నుంచి జిల్లా మరియు సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు మారుస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది ధృవీకరించారు. వరుసగా మరణశిక్షలు విధిస్తుండటంతో.. న్యాయవాదులతో పాటు కేసులతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో కూడా తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే కేసుల బదిలీ నిర్ణయం జరిగిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి స్పష్టం చేశారు.అసలెవరీ జడ్జి రవికుమార్ దివాకర్?లక్నోకు చెందిన 46 ఏళ్ల రవి కుమార్ దివాకర్ 2009లో ఆజంగఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన కెరియర్ ప్రారంభించారు. 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా, ఆ తర్వాత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొందారు. బీకామ్, ఎల్ఎల్ఎమ్ చదివిన ఆయన.. నవంబర్ 2025 నుంచి ముజఫ్ఫర్ నగర్లో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో 2022లో వారణాసిలోని గ్యాన్వాపి కాంప్లెక్స్‌లో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలు ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.ఏయే కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేశారంటే..? ఆగస్టు 13వ తేదీన ఇచ్చిన తీర్పు.. షామ్లీ జిల్లాలో 2014 జులై 14న తేదీ జరిగిన
పవన్ కుమార్ హత్య కేసులో రామ్‌వీర్, రాజీవ్, రాహుల్, హరేందర్లకు మరణశిక్షతో పాటు రూ.1.70 లక్షల ఫైన్ విధించారు. ఆగస్టు 12వ తేదీన ఇచ్చిన తీర్పులో.. 1999 డిసెంబర్ 9వ తేదీన రూ.5 లక్షల కోసం చెక్క వ్యాపారి సలీమ్‌ను అపహరించి, గొంతు కోసి చంపిన కేసులో నిందితుడు షానవాజ్‌కు మరణశిక్ష విధించారు. జులై 17వ తేదీన ఇచ్చిన తీర్పులో.. 2011 ఆగస్టు 20వ తేదీన దారి దోపిడీ యత్నంలో రైతు రాజ్ సింగ్‌ను కాల్చి చంపిన కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించారు. జులై 6వ తేదీన ఇచ్చిన తీర్పులో.. 2010 ఆగస్టు 24న పంచాయతీ ఎన్నికల కక్షలతో రాజ్బీర్ సింగ్‌ను చంపిన కేసును అరుదైన కేసుగా పరిగణిస్తూ.. దోషులైన మాజీ సర్పంచ్ ప్రమోద్, అతడి అనుచరుడు సహదేవ్లకు మరణశిక్ష విధించారు. జులై 2వ తేదీన ఇచ్చిన తీర్పులో.. 2020 జూన్ 4వ తేదీన విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు రతిరామ్‌ను పొడిచి చంపిన కేసులో దీపక్‌కు మరణశిక్ష విధించారు. జూన్ 20వ తేదీన ఇచ్చిన తీర్పులో.. రాజేంద్ర సైని హత్య కేసులో గజేంద్ర, రామ్కిరణ్లకు ఉరిశిక్ష విధించారు. మే 30వ తేదీన ఇచ్చిన తీర్పులో.. 2011 నవంబర్ 7న ముజఫ్ఫర్ నగర్లో రాజేష్ దేవి, ఆమె 6 ఏళ్ల కుమారుడు హిమాన్షులను ఇటుకలతో కొట్టి చంపిన 15 ఏళ్ల నాటి కేసులో రహీస్ అనే 50 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 28వ తేదీన ఇచ్చిన తీర్పులో.. 2019 నాటి హత్య కేసులో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమారులకు మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 6వ తేదీన ఇచ్చిన తీర్పులో.. రూ.45 లక్షల ఆర్థిక వివాదంతో లాయర్ మహమ్మద్ సమీర్‌ను అపహరించి చంపిన కేసులో ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేశారు.