విమానాశ్రయంలో ల్యాండ్ అయి.. పాక్ కిరాయి మూకలపై ఎదురుదాడి చేసి.. బారాముల్లాను విడిపించింది. మరోవైపు షేర్వానీ తమను తప్పుదారి పట్టించాడని గ్రహించిన పాక దళాలు అతడిని బంధించాయి. నవంబర్ 7వ తేదీన అతడిని శిలువ వేసి.. తుపాకులతో కాల్చి చంపారు. 14 తూటాలు అతడి శరీరంలోకి దూసుకెళ్లాయి. అతడి త్యాగాన్ని భారత సైన్యం గౌరవించి.. శ్రీనగర్ లైట్ ఇన్ఫాంట్రి బలిదాన స్తంభంపై ముక్బూల్ షేర్వానీ పేరును రాసింది. అంతేకాదు.. తన రెండో బెటాలియన్‌కు ‘షేర్వానీ పల్టాన్’ అని పేరుపెట్టింది. ఇక అతడి పేరిట బారాముల్లాలో ఆడిటోరియం నిర్మించారు. భారత సైన్యం 2022లో షేర్వానీ సమాధిని పునరుద్ధరించింది.
1965లో భారత్-పాక్ ప్రధాన యుద్ధం ఆగస్టు 5వ తేదీన మొదలైంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం భారత వాయుసేన చిట్టగాంగ్‌లోని పాక్ వాయుసేన స్థావరంపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాక్ విమానాలు పశ్చిమబెంగాల్లోని కలైకొండ వాయుసేన స్థావరంపై దాడి చేయడంతో పలు ఫైటర్జెట్లు, కాన్బెర్రా బాంబర్లు నష్టపోయింది. దీంతో ఓ పక్క తుపాను వాతావరణం ఉన్నా.. లెక్కచేయకుండా అదే రోజు అక్కడి నుంచి మిగిలిన కాన్బెర్రా బాంబర్లను గోరఖ్‌పుర్‌లోని వాయుసేన స్థావరానికి పంపింది.
మరోవైపు పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని బాదిన్‌లో అమెరికా ఇచ్చిన శక్తిమంతమైన రెండు రాడార్ డోమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని భూమికి 80 అడుగుల ఎత్తులో అమర్చింది. వీటిని శత్రువులు గుర్తించకుండా సమీపంలో డెకాయ్ డోమ్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఈ రాడార్లు 300 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాల కదలికలను గుర్తిస్తాయి. ఈ క్రమంలో నాటి గుజరాత్ సీఎం బల్వంత్రాయ్ మెహతా కుటుంబంతో ప్రయాణిస్తున్న విమానాన్ని పాక్ జెట్లు గుర్తించి భారత గగనతలంలో కూల్చేశాయి.
దీంతో బాదిన్‌లో ఏర్పాటు చేసిన రాడార్లను ధ్వంసం చేయాలని వాయుసేన నిర్ణయించింది. 16వ, 106వ స్క్వాడ్రన్లను రంగంలోకి దించింది. వీటివద్ద ఉన్న కాన్బెర్రా బాంబర్ విమానం సాయంతో.. బాదిన్ రాడార్‌ను ఫొటోలు తీశారు. సెప్టెంబర్ 21న దీనిని ధ్వంసం చేసేందుకు 16వ స్క్వాడ్రన్ ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు బాంబర్ విమానాలను సిద్ధం చేయగా.. వీటిల్లో రెండింటిపై 2 టన్నుల బరువైన నాలుగు భారీ బాంబులను అమర్చింది. మరో రెండు విమానాలపై 500 కిలోల బరువైన 12 బాంబులను ఏర్పాటు చేశారు. ఇక ఐదో విమానం 20 వేల అడుగుల ఎత్తులో డెకాయ్లా పనిచేసి రాడార్ దృష్టిని ఆకర్షించే బాధ్యత తీసుకొంది.
ఇక అత్యంత కీలకమైన ఆరో కాన్బెర్రా బాంబర్పై కేవలం క్షిపణులు, గన్లు అమర్చింది. ఈ విమానం రాడార్ ఎత్తుకంటే తక్కువగా.. అంటే భూమికి 30 అడుగుల ఎత్తులో ప్రయాణించాలి. బాంబర్లను ఈ ఎత్తులో నడపడంలో వింగ్‌కమాండర్ పీటర్ విల్సన్‌ది అందెవేసిన చేయి. ఆయనకు తోడు ఫ్లైట్ ఆఫీసర్ శంకరన్ కూడా ఉన్నారు. ఈ బృందం తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది.
కేవలం 30 అడుగుల ఎత్తులో ప్రయాణించి రాడార్ కేంద్రం వద్దకు చేరారు. విల్సన్ విమానంలోని ఓ రాకెట్ పాడ్ మాత్రం మధ్యలో మొరాయించింది. కానీ, బాదిన్ రాడార్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ రోజు బాంబింగ్ దెబ్బకు అక్కడ గ్రామంలోని వారు భూకంపం వచ్చిందని భ్రమించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదకర మిషన్కుగాను వింగ్ కమాండర్‌కు వీరచక్ర పురస్కారం లభించింది. వాస్తవానికి ఈ మిషన్ తర్వాత భారత్ కరాచీ పెషావర్ వద్ద స్వేచ్ఛగా గగనతల దాడులు నిర్వహించింది.
1971 యుద్ధంలో పాక్‌ను ముక్కలు చేసి.. భారత్ విజయం సాధించడంలో ముక్తివాహిని పాత్ర కీలకమైంది. తూర్పు పాకిస్థాన్‌ను లోలోపల దెబ్బతీసిందీ దళం. వాస్తవానికి 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్థాన్‌లోని అవామీ లీగ్ భారీ మెజార్టీ సాధించింది. దీంతో దాని అధినేత ముజిబుర్ రెహమాన్‌తో రాజీ చేసుకునేందుకు పశ్చిమ పాకిస్థాన్ నేత జుల్ఫీకర్ అలీ భుట్టోతో అవగాహన కుదరలేదు. దీంతో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటానికి ముజిబుర్ బీజం వేశారు. 1971 మార్చి 25న పాక్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. 26వ తేదీన ముజిబ్ స్వాతంత్ర్య ప్రకటన చేశారు. దీంతో పాక్ జనరల్ యాహ్యఖాన్ ఆపరేషన్ సెర్చిలైట్ పేరిట మర్నాడే శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. పశ్చిమ పాక్ సైన్యం హింసాత్మక చర్యలతో తూర్పు పాకిస్థాన్‌లో సాయుధ దళాల సిబ్బంది, పోలీసులు కూడా బలయ్యారు. వారిలో కొందరు భారత్‌కు చేరుకున్నారు.
ఈ క్రమంలో వారికి శిక్షణ ఇచ్చి పాక్ దళాలను ఎదుర్కోవాలని భారత్ భావించి ఏప్రిల్ 25వ తేదీన ఆపరేషన్ జాక్‌పాట్ ప్రారంభించిది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్‌కు అనుబంధంగా పనిచేసే స్పెషల్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు డీఐజీ జ్ఞానానంద శర్మ, పొలిటకల్ ఆఫీసర్ బిరజా నంద చౌదరీని రంగంలోకి దింపింది. అప్పటి వరకు వీరు ఈశాన్య భారత్‌లో చైనా ఆక్రమణలు ఎదుర్కోవడానికి స్థానికులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో బిరజా పేలుడు పదార్థాల నిపుణుడు. అస్సాంలోని కొండ ప్రాంతమైన లోయర్ హాఫ్లాంగ్ అనే చోట శిక్షణ ఇచ్చారు. బ్యాచ్‌ల వారీగా దాదాపు వెయ్యి మందికిపైగా శిక్షణ ఇచ్చినట్లు అంచనాలున్నాయి. అనధికారిక అంచనాలు 70,000 వరకు ఉండొచ్చని చెబుతున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారిని పశ్చిమబెంగాల్, బిహార్, అస్సాం, త్రిపుర, మేఘాలయ మార్గాల్లో బంగ్లాదేశ్‌లోకి ప్రవేశపెట్టారు. ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు వాడటం, మెరుపుదాడులు చేయడం, కమాండో శిక్షణ వంటివి అందించారు.
సరిహద్దుల వెంట తన నెట్‌వర్క్‌తో క్యాంపులు ఏర్పాటు చేయడం.. ముక్తివాహిని సభ్యులను పాక్‌లోకి పంపించడం జ్ఞానానంద చూసుకోగా..పేలుడు పదర్థాలు, దాడుల్లో శిక్షణను బిరజా నంద పర్యవేక్షించారు. ఆ తర్వాత ఈ దళం 200కుపైగా వంతెనలు, 100కుపైగా రైల్వేలైన్లు, 90వరకు విద్యుత్తు కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇది పశ్చిమ పాక్ సైనికుల లాజిస్టిక్స్ వ్యవస్థను దెబ్బతీసింది. అంతేకాదు.. ముక్తివాహిని నావికా విభాగం పెద్ద సంఖ్యలో పాక్ నేవీని దెబ్బతీసింది. భారత్‌తో ప్రత్యక్ష యుద్ధం మొదలు కాగానే తూర్పు పాకిస్థాన్ కొన్ని రోజుల్లోనే పతనమై.. బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించేందుకు సహకరించింది. ఫలితంగా భారత్‌కు ఒక వైపు ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించినట్లైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని తమిళనాడు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.