Air India Pilots| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థకు చెందిన ఇద్దరు పైలట్లు డ్రగ్స్ పరీక్షలో విఫలమయ్యారు. ప్రాథమికంగా జరిగిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడికాగా.. తుది పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఇద్దరిని ఎయిరిండియా (Air India) తాత్కాలికంగా విధుల నుంచి పక్కనపెట్టింది. ఇటీవల ఫుకెట్-దిల్లీ ఎయిరిండియా విమానంలో పైలట్‌కు డోప్ టెస్టు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న విమానం ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ప్రయణికులు, సిబ్బంది కలిపి విమానంలో 145 మంది ఉన్నారు. ఈ ఘటన అనంతరం పైలట్లు ఇద్దరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ప్రాథమిక పరీక్షలో పైలట్-ఇన్-కమాండ్‌కు పాజిటివ్ వచ్చింది. దీని తర్వాత సైకోయాక్టివ్ పరీక్షను నిర్వహించగా.. గంజాయి సేవించినట్లు నిర్ధరణ అయ్యింది. ఈ ఘటన నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్లందరికీ డోప్ టెస్ట్‌ను తప్పనిసరి చేసింది. ఈ రెండు విభాగాల్లో కలిపి మొత్తంగా దాదాపు 5వేల మంది పైలట్లు ఉన్నారు. ఇప్పటివరకు 400 మంది పైలట్లకు పరీక్షలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు పైలట్లకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు