© 2026 nimisham.in

Koil Alwar Tirumanjanam: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 75,836 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.. ఇందులో 34 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. నిన్నటి ఆదాయం రూ. 5.3 కోట్లుగా ఉందని టీటీడీ వెల్లడించింది. ఈ క్రమంలో తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ ఫోటోలను టీటీడీ షేర్ చేసింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జూలై 13న ఈ తిరుమంజనం జరుగుతుందని టీటీడీ ముందే ప్రకటించింది. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా నాలుగుసార్లు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వీటిలో ఆదివారం ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఉగాదికి ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈనెల 17వ తేదీన జరగనున్న ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని, నిన్న తిరుమలలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పవిత్ర సుగంధ పరిమళాలతో స్వామివారి గర్భాలయం ఇతర అనుబంధ ఆలయాలను శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు. 'కోయిల్' అంటే ఆలయం, 'ఆళ్వార్' అంటే భక్తులు అని అర్థం. అంటే 'దేహమే దేవాలయం' అని దీని అంతరార్థం. మానసిక కల్మషాలు లేకుండా భక్తి భావంతో మనల్ని మనం పవిత్రంగా ఉంచుకుంటేనే దైవసన్నిధిని పొందుతామని పండితులు చెబుతారు. ఈనెల 17న ఆణివార ఆస్థానం జరగనున్న నేపథ్యంలో, ఈ శుద్ధి కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు టీటీడీ దర్శనాలను అనుమతించారు. అలాగే, ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జూలై 13న తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ప్రత్యేక ఆర్థిక సేవలను రద్దు చేసింది. ప్రోటోకాల్ దర్శనాలను మినహాయించి, ఇతర బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. దీనికి సంబంధించి ముందు రోజుల్లో
ఎలాంటి లేఖలను స్వీకరించడం లేదని కూడా స్పష్టం చేసింది.