
Traffic Restrictions In Hyderabad: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని కొమరం భీం ఆదివాసి భవన్ కు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుండి రోటరీ మార్గాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఈరోజు మధ్యాహ్నం రోడ్ నెంబర్ 10 వైపు వెళ్లే వాహనదారులు గమనించాలి. బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసి కొమరం భీమ్ భవన్‌ను సందర్శించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుండి రోటరీ, రోడ్ నెంబర్ 9, 10 మధ్య తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
మాసబ్ ట్యాంక్ లేదా తాజ్ కృష్ణ నుండి రోడ్ నెంబర్ 10, జహీరాబాద్ లేదా ఎన్టీఆర్ భవన్ ,జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే వాహనదారుల కోసం కొన్ని మార్గాలను సూచించారు. మొదటి మార్గంలో మాసబ్ ట్యాంక్ నుండి రోడ్ నెంబర్ 12, అగ్రసేన్ ఐలాండ్ మీదుగా ఎన్టీఆర్ భవన్ చేరుకుని, అక్కడి నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లవచ్చు.
రెండవ మార్గంలో మాసబ్ ట్యాంక్ నుండి రోడ్ నెంబర్ 7, 14 మీదుగా ఎన్టీఆర్ భవన్ చేరుకుని, అక్కడి నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌కు వెళ్లవచ్చు. అలాగే, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లేదా ఎన్టీఆర్ భవన్ నుండి జహీరా నగర్, రోడ్ నెంబర్ 10, ఖైరతాబాద్ లేదా మాసబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ భవన్ నుండి రోడ్ నెంబర్ 14, 7 మీదుగా ఖైరతాబాద్ లేదా మాసబ్ ట్యాంక్‌కు చేరుకోవచ్చు.
మరో మార్గంలో ఎన్టీఆర్ భవన్ నుండి అగ్రసేన్ ఐలాండ్, రోడ్ నెంబర్ 12 మీదుగా మాసబ్ ట్యాంక్‌కు చేరుకోవచ్చు. వాహనదారులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను పాటించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.





