
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Amaravati Capital Road Network: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధానికి రాచమార్గంగా.. రవాణా వ్యవస్థకు వెన్నెముకగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిలవనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రేపు ప్రారంభం కాబోతున్నది. సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని రేపు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ రోడ్డు ప్రారంభంతో రాజధాని ప్రాంతం అమరావతికి రాకపోకలు సాగించేందుకు సులువు కానుంది.
రాజధానిలోకి రాకపోకలు మరింత వేగవంతం, సులభతరం చేసేందుకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ రోడ్డు నిర్మించారు. గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న అన్ని ఎన్-సిరీస్ రహదారులను ఇ-3 అనుసంధానం చేస్తుంది.
ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దిశల్లో గ్రిడ్ తరహాలో రహదారులను ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఎలాంటి మలుపులు లేకుండా రాజధాని ప్రాంతంలోకి నేరుగా చేరుకునేలా ఈ రహదారి వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ, ఎన్ సిరీస్ రోడ్లలో కలిపి 34 ప్రధాన రహదారులు ఉండగా.. మొత్తం 350 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్‌లో పెరగనున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రాజధాని రవాణా వ్యవస్థకు ఇది వెన్నెముకగా ప్రభుత్వం భావిస్తోంది.
సీడ్ యాక్సెస్ రోడ్డు వివరాలు దొండపాడు నుంచి ప్రారంభమయ్యే ఇ-3 రోడ్డు రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ హాస్పిటల్స్ వద్ద జాతీయ రహదారి-16ను కలుపుతుంది. పొడవు: 21.77 కిలోమీటర్లు వెడల్పు: 60 మీటర్లు వ్యయం రూ.1,519 కోట్లు
మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్‌లో 9 లేన్ల రహదారి, ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, సర్వీసు రోడ్లు ఏర్పాటు. డ్రైనేజీ, తాగునీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ నెట్‌వర్క్‌లకు అవసరమైన మౌలిక వసతులను కూడా రహదారి నిర్మాణంతోపాటే కల్పిస్తున్నారు. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, గ్రీన్‌బెల్ట్‌లతో ఇ-3ను ఆధునిక నగర రహదారిగా తీర్చిదిద్దుతున్నారు.
స్టీల్ బ్రిడ్జ్ ఈ-3 రోడ్డును విజయవాడ-మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు బకింగ్‌హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటుచేశారు. రూ.82 కోట్లతో 478 మీటర్ల పొడవున నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జిని నిర్మించగా రేపు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలకు మార్గం సులువుగా మారుతుంది. కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. వాహనాలు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది.
రేపు సీఎం పర్యటన వివరాలు ఉదయం 10.20 గంటలకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి వద్దకు చేరిక. 10.35 గంటలకు శిలాఫలకం ఆవిష్కరించి రోడ్డు ప్రారంభం 10.45 గంటలకు ప్రసంగం అనంతర రాయపూడికి చేరుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయాల పరిశీలన మధ్యాహ్నం 01.25 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు

