సామాన్యుడి జేబులోని చిల్లర నాణెం నుంచి దేశ ఆర్థిక శక్తిని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టే ప్రతీక వరకు.. మన రూపాయి సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన అధ్యాయం. భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న ఈ చారిత్రక తరుణంలో, మన చేతుల్లో మెదిలే కరెన్సీ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆసక్తికరమైన ఎన్నో సత్యాలు వెలుగులోకి వస్తాయి.ఒకప్పుడు సంస్థానాల రాజముద్రలతో, వేర్వేరు పరిమాణాల్లో చెలామణి అయిన రాగి నాణేలు, వెండి నాణేల స్థానంలో.. నేడు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిజిటల్ సంతకంగా మారిన డిజిటల్ రూపాయి వరకు మన రూపాయి సాధించిన పురోగతి అసాధారణం.రాజభవంతుల నాణేల నుంచి ఏకీకృత వ్యవస్థ వైపు..1947కి పూర్వం భారతదేశం ఆర్థికంగా, భౌగోళికంగా ఎన్నో ముక్కలుగా ఉండేది. హైదరాబాద్ నైజాం నాణేల నుంచి మరాఠాల కరెన్సీ వరకు ప్రతి రాచరిక ప్రాంతానికి సొంత నాణేల వ్యవస్థ ఉండేది. అయితే, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే క్రమంలో ఆర్థిక సమగ్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది.1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావంతో కరెన్సీ జారీ హక్కులన్నీ ఒకే కేంద్రీకృత వ్యవస్థ కిందకు వచ్చాయి. అంతకుముందు ప్రైవేటు బ్యాంకులు, ప్రెసిడెన్సీ బ్యాంకులు ముద్రించే నోట్లకు చరమగీతం పడుతూ, 1861 నాటి పేపర్ కరెన్సీ యాక్ట్ ద్వారా ప్రభుత్వమే నేరుగా నోట్లను చలామణిలోకి తెచ్చింది.ఒక్క రూపాయి నోటు వెనుక ఉన్న అసలు కథ!మనదేశంలో చలామణి అయ్యే ప్రతి నోటుపైనా ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది.. కానీ, ఒకే ఒక్క రూపాయి నోటుపై మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రమైన వెండి కొరత ఏర్పడింది. నాణేలను ముద్రించడం సాధ్యం కాక, బ్రిటన్‌లో ఐదో జార్జ్ రాజు చిత్రంతో మొదటిసారిగా కాగితపు రూ.1 నోటును ముద్రించారు.స్వాతంత్ర్యం వచ్చాక 1949లో బ్రిటీష్ రాజు బొమ్మ స్థానంలో సారనాథ్ అశోక స్థూపాన్ని చేర్చారు. రూపాయి నోటు అనేది నేరుగా భారత ప్రభుత్వపు చట్టబద్ధమైన కరెన్సీ కావడం వల్లనే, అది నేటికీ ఆర్బీఐ సంతకం లేకుండా ఆర్థిక కార్యదర్శి సంతకంతోనే చలామణిలోకి వస్తోంది. దుబాయ్, బహ్రెయిన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో కూడా ఒకప్పుడు మన రూపాయి నోటునే వాడటం గమనార్హం.RBI ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం ఆమోదం.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనఅణా వ్యవస్థ నుంచి పైసల లెక్కలు: మార్పుల సమరంస్వాతంత్ర్యం వచ్చినా కూడా మన రూపాయి వెంటనే పూర్తిగా మారిపోలేదు. 1957 వరకు మన దేశంలో ఆణాల వ్యవస్థే నడిచేది. ఒక రూపాయికి 16 ఆణాలు ఉండేవి. అయితే 1957 ఏప్రిల్ 1న భారత్ దశాంశ పద్ధతి వైపు అడుగులు వేసింది. రూపాయిని 100 పైసలుగా విభజించారు. నాటి ప్రజలు పాత ఆణాల నుంచి కొత్త నయా పైసా లెక్కలకు మారడం ఒక పెద్ద సామాజిక మార్పుగా నిలిచింది. కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరగడం, కొనుగోలు శక్తి మారడంతో 2011 నాటికి 25 పైసలు, అంతకంటే తక్కువ విలువైన నాణేలను ఆర్బీఐ శాశ్వతంగా రద్దు చేసింది.గాంధీజీ ముఖచిత్రం.. పెద్ద నోట్ల రద్దు నాటకీయ పరిణామాలుమన నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ 1987లో మొదటిసారిగా రూ.500 నోటుపై ప్రత్యక్షమైంది. ఆ తర్వాత 1996 నుంచి ఆర్బీఐ మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను అధికారికంగా ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు వాటర్ మార్కులు, సెక్యూరిటీ థ్రెడ్స్ వంటి సరికొత్త సాంకేతికతలను జోడించారు. ఇక దేశ ఆర్థిక చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక ఘట్టం 2016 నవంబర్ 8న చోటుచేసుకుంది. పాత రూ.500, రూ.1000 నోట్లను అర్ధరాత్రికి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన కొత్త రూ.2000 నోటు కూడా తన కాలపరిమితిని పూర్తి చేసుకుని క్లీన్ నోట్ పాలసీ కింద మళ్లీ బ్యాంకులకు చేరుకుంది.ప్రపంచ వేదికపై ₹ గుర్తు.. అంకెల్లో విప్లవం!డాలర్ ($), పౌండ్ (£), యూరో (€), యెన్ (¥) తరహాలోనే మన రూపాయికి కూడా ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో 2010లో భారత్ ₹ సంకేతాన్ని సొంతం చేసుకుంది. ఐఐటీ బొంబాయి గ్రాడ్యుయేట్ డి. ఉదయ్ కుమార్ డిజైన్ చేసిన ఈ గుర్తు, దేవనాగరి ర , రోమన్ Rల కలయికగా రూపుదిద్దుకుంది. ఈ చిన్న గుర్తు భారత ఆర్థిక రంగానికి ప్రపంచస్థాయిలో తిరుగులేని గుర్తింపును, స్వయంప్రతిపత్తిని తెచ్చిపెట్టింది. మారబోతున్న రూపాయి దశ. రికార్డ్ జంప్!జేబులో నోట్ల నుంచి స్మార్ట్‌ఫోన్ క్యూఆర్ కోడ్ వరకు!ఒకప్పుడు అంగడికి వెళ్తే చేతి నిండా నోట్లు, నాణేలు పట్టుకెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు చిరు వ్యాపారి దగ్గర టీ తాగినా, పెద్ద షాపింగ్ మాల్ లో కొనుగోళ్లు చేసినా ఫోన్ తో స్కాన్ చేస్తే సెకన్లలో లావాదేవీ పూర్తవుతోంది. యూపీఐ (UPI) రాకతో రూపాయి భౌతిక రూపాన్ని దాటి డిజిటల్ రూపంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.ఆర్బీఐ తీసుకొచ్చిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ దీనికి మరింత ఊతమిచ్చింది. డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ, దేశంలో నగదు చెలామణి కూడా భారీగానే ఉందనేది ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి రూపం మారవచ్చు.. మాధ్యమం మారవచ్చు.. కానీ 80 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రూపాయి సాధించిన ఈ పురోగతి, ప్రగతి పథంలో దూసుకుపోతున్న మన దేశ సమర్థతకు ప్రత్యక్ష నిదర్శనం!