© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Special Intensive Revision: ఒక పౌరుడికి ఒకే ఓటు విధానంతో అధికార యంత్రాంగం ఓటరు ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండే విధంగా ఓటరు జాబితాను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. 3 కోట్ల 38 లక్షల 26వేల 448 మంది ఓటర్లున్న తెలంగాణలో 2 కోట్ల 64లక్షల 87వేల 214 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. 21.7 శాతం మంది ఓటరు జాబితానుంచి తొలగించారు. వీరిలో మృతిచెందిన ఓటర్లు, వలసవెళ్లినవారు, ఇచ్చిన అడ్రస్సుల్లో లేని వారు, ఒకటికంటే ఎక్కువచోట్ల నమోదైన ఓటర్లను జాబితా నుంచి తొలగించిన వారిలో ఉన్నారు. ఓటరు ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారంతా ఆగస్టు 30తేదీలోపు కొత్త ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం కల్పిస్తూ అధికారులు వెసులుబాటు కల్పించారు. పాత ఓటర్లు, కొత్తగా నమోదైన ఓటర్లతో అక్టోబరు 17 తేదీనాటికి సమగ్ర జాబితాను ప్రకటించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్లకు నోటీసు జారీచేసి, విచారణ లేకుండా ఏ ఓటరు పేరూ తొలగించబోమని, అర్హులెవరూ ఓటు హక్కుకు దూరం కావొద్దన్నది ఎన్నికల సంఘం ప్రధాన ఉద్ధేశమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సర్ సర్వే కంటే ముందు చేపట్టిన మ్యాపింగ్ సర్వేలో సుమారు 89 లక్షల ఓట్లలో తేడాలు గుర్తించారు. ఈ ఓటర్లకు ఎస్ఐఆర్ 2002తో మ్యాపింగ్ జరిగినప్పటికీ 11
రకాల అంశాల్లో తేడాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బీఎల్వోలకు ఎడిట్ ఆప్షన్ కల్పించడంతో చిన్న, చిన్న పొరపాట్లు ఉన్న ఓట్లను సరిదిద్దారు. ఎడిట్ అనంతరం రాష్ట్రంలో 61 లక్షల ఓట్లలో భారీ తేడాలున్నట్లు తేలింది. ఇందులో గ్రేటర్ పరిధి జిల్లాలోనే 10 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లకు ఎస్ఐఆర్ 2002తో మ్యాపింగ్ చేసినప్పుడు 11 రకాల అంశాల్లో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. వీరందరికి ఆగస్టు 17న విడుదల చేసే ముసాయిదా జాబితా అనంతరం నోటీసులు అందనున్నాయి. ఈ ఓటర్లు ఈఆర్వో ముందు హాజరై ఈసీ పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటును కాపాడుకోవచ్చు. ఈ ఓటర్లలోనూ భారీగా తొలగింపు అవకాశాలు కనిపిస్తున్నాయి.
40 లక్షల ఓట్లు వలస వెళ్లినవారు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఓట్లలో వలస వెళ్లిన ఓటర్లనే అధికంగా గుర్తించినట్లు సమాచారం. సుమారు 40లక్షలకుపైగా ఓటర్లు వలస వెళ్లినట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఓటర్ల ఇంటికి వెళ్లినప్పుడూ వారు అక్కడ ఉండడం లేదని, పూర్తిగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చూపారు. కొంతమంది ఓటర్లు మృతి చెందడం, చిరునామాలో లేకపోవడం వంటి అంశాలను గుర్తించారు. పలువురు ఓటర్లకు రాష్ట్ర పరిధిలోనే రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇలా ఉన్న ఓట్లను గుర్తించడానికి ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. డ్యూప్లికేషన్ ఓటర్లను ముసాయిదా నుంచి తొలగించారు.
డూప్లికేట్ ఓట్లను తొలిగించారు.. ఓటర్ల జాబితాలో డూప్లికేషన్ తో ఉన్న పేర్ల తొలగింపు జాబితాలో తెలంగాణ వ్యాప్తంగా 73 లక్షల 39వేల 234 మందిని తొలగించారు. సమగ్ర సవరణ జాబితాలో 6లక్షల 70వేల 203 ఓటర్లు రెండు మూడు చోట్ల నమోదైనట్లు గుర్తించారు. తెలంగాణలో వ్యాప్తంగా 9 లక్షల 22వేల 230 మందిని మృతులుగా గుర్తించారు. 45లక్షల 18వేల 961 మంది శాశ్వతంగా అడ్రస్ మారినట్లు గుర్తించారు. తెలంగాణలో అత్యధిక డిజిటలైజేషన్‌తో యాదాద్రి భువనగిరి 94.30 తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లో 89.45 శాతం, జగిత్యాలలో 89.60 శాతం పూర్తి అయింది. రెండు సార్లు గడువు పొడిగించినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పెరగలేదు.
తెలంగాణ ఓటర్ల వివరాల్లో తేడా గణణీయంగా ఉందని రాజకీయ నాయకులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. జిల్లా స్థాయిలో ఆదిలాబాద్‌లో 28.5 శాతం ఓటర్ల వివరాల్లో తేడా ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్‌లో 27.4 శాతం, నిర్మల్‌లో 26.1 శాతం, మెదక్‌లో 24.6 శాతం, కామారెడ్డిలో 23.9 శాతం, సంగారెడ్డిలో 23.8 శాతం నమోదు అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌లో 30.4 శాతం అనామలీస్తో అత్యధికంగా ఉండగా.. నారాయణఖేడ్‌లో 29.3 శాతం, నిజామాబాద్ అర్బన్‌లో 28.4 శాతం, షాద్‌నగర్‌లో 28.3 శాతం, నిర్మల్‌లో 28.29 శాతం, నిజామాబాద్ రూరల్‌లో 28.1 శాతం నమోదయ్యాయి.
ఎస్ఐఆర్లో అత్యధికంగా అన్ కలెక్టబుల్ ఫారాలు నమోదైన ప్రాంతంగా గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం నిలిచింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలు కలిపి సుమారు 41.5 లక్షల అన్‌కలెక్టబుల్ ఫారాలు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70.8 లక్షలతో పోలిస్తే ఇవి దాదాపు 58.6 శాతానికి సమానం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను సేకరించడంలో అనేక ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. అద్దె ఇళ్లలో ఉండేవారు తరచూ ఇళ్లను మార్చడం.. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం.. మూసివేసిన ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఓటర్లను గుర్తించడం కష్టంగా ఉండటం, మరణించిన ఓటర్ల పేర్లు కొనసాగడం వంటి కారణాలు అన్‌కలెక్టబుల్ కేసులు పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఓటర్ల జాబితాగ సమగ్ర సవరణలో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో 40శాతం ఓట్లు గల్లంతయ్యాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో లక్ష ఓట్లకుపైగా గల్లంతయ్యాయి. ముసాయిదా జాబితా ప్రకారం లక్షా 39 వేల 899 ఓట్లతో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం తక్కువ ఓట్లున్న నియోజకంగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం లక్షా 40 వేల 545 ఓట్లు, ఛార్మినార్ అసెంబ్లీనియోజకవర్గం లక్షా 43 వేల 309 ఓట్లు, అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం లక్షా 62 వేల 011 ఓట్లు, గోషామహాల్ లక్షా 65 వేల 060 ఓట్లు, సికింద్రాబాద్ లక్షా 66 వేల 241 ఓట్లు, ముషీరాబాద్ లక్షా 70 వేల 046 ఓట్లు, ఖైరతాబాద్ లక్షా 70 వేల 195 ఓట్లతో ఉన్నాయి. ఓటర్ల జాబితా సమగ్రసర్వేతో తెలంగాణ ఓటర్లు చాలామంది డబుల్ ఎంట్రీ ఓట్లతో ఉన్నారని తెలిసింది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని, డూప్లికేషన్ ఓటర్లను గుర్తించి తొలగించారు. ఎన్యూమరేషన్లో వెల్లడైనా వివరాల ఆధారంగా తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన వారు వంటి కేటగిరీలపై తర్వాతి దశలో అధికారులు పరిశీలన చేపట్టనున్నారు. ఎన్యూమరేషన్లో గుర్తించిన వివరాల ఆధారంగా వెంటనే ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు కాదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.. తుది ఓటర్ల జాబితా ప్రక్రియలో నిబంధనల ప్రకారమే పరిశీలన, అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన చర్యలు చేపట్టబోతున్నారు. కొత్తగా యువజన ఓటర్లు నమోదైతే తెలంగాణ ఓటర్ల సంఖ్య కొంత మేర పెరిగే అవకాశం ఉందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.