© 2026 nimisham.in
పిల్లలు 10 నుంచి 12 ఏళ్లు దాటి టీనేజ్‌లోకి అడుగుపెట్టే సమయంలో తల్లిదండ్రులకు సవాల్‌తో కూడుకున్న పరిస్థితులు ఎదురవుతాయి. ఈ సమయంలో పిల్లలు పూర్తిగా చిన్నవారుగానూ ఉండరు, అలాగే పూర్తిగా పెద్దవారుగానూ ఉండరు. ఒకవైపు కెరీర్, బోర్డు పరీక్షల ఒత్తిడి ఉంటే.. మరోవైపు శారీరక మార్పులు, స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దవారయ్యారని.. వారికి తమ అవసరం తక్కువగా ఉందని భావిస్తారు. కానీ వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధం. నిపుణుల అభిప్రాయం ప్రకారం కౌమారదశలో ఉన్నవారికి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు అత్యంత అవసరం.ఇక, టీనేజ్ పిల్లలకు ఎంతవరకు వ్యక్తిగత స్వేచ్ఛ (Privacy) ఇవ్వాలి? పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ప్రైవసీ ఇవ్వడం ఎంత ముఖ్యమో, కొన్ని విషయాల్లో వారిని పర్యవేక్షించడం కూడా అంతే అవసరం. ఆ సున్నితమైన సరిహద్దుల్ని అర్థం చేసుకోవడం తల్లిదండ్రులకు చాలా ముఖ్యం. సైకాలజీ టుడే ప్రకారం టీనేజ్ పిల్లలకు ఏ వయసులో ప్రైవసీ ఇవ్వాలి, ఏ విషయాల్లో ఇవ్వకూడదో తెలుసుకుందాం.పిల్లలకు తప్పనిసరిగా ప్రైవసీ ఇవ్వాల్సిన విషయాలు గదిలోని వ్యక్తిగత వస్తువులు: పిల్లల గదిలో ఉండే పర్సనల్ డైరీలు, డ్రాయింగ్ పుస్తకాలు, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌లు లేదా నోట్స్ విషయంలో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకోకూడదు. వారి అల్మారాలో ఒక భాగాన్ని లేదా వారి వస్తువుల్ని పూర్తిగా వారి వ్యక్తిగత విషయంగానే ఉంచాలి. దుస్తుల ఎంపిక (డ్రెస్సింగ్ స్టైల్): వయసు పెరిగే కొద్దీ పిల్లలు తమకు నచ్చిన విధంగా దుస్తులు ధరించాలని అనుకుంటారు. వారి స్టైల్, ఫ్యాషన్ ప్రయోగాలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. దీనివల్ల భవిష్యత్తులో వారు సొంతంగా సరైన నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శారీరక గోప్యత: పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. కానీ స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం వంటి విషయాల్లో వారికి చిన్నప్పటి నుంచే పూర్తి గోప్యతను అలవాటు చేయాలి. ఇది వారిలో వ్యక్తిగత భద్రత
, బాడీ బౌండరీస్పై అవగాహన పెంచుతుంది.పిల్లలకు పూర్తి ప్రైవసీ ఇవ్వకూడని (నిఘా ఉంచాల్సిన) విషయాలు ఇంటర్నెట్, సోషల్ మీడియా: డిజిటల్ విషయంలో పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ప్రమాదకరం. వారు ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారు, ఏయే యాప్స్ వాడుతున్నారు, ఆన్లైన్లో ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఆహారం, ఆరోగ్యం: ఈ వయసులో పిల్లల ఎదుగుదల వేగంగా ఉంటుంది. వారు బయట ఎలాంటి జంక్ ఫుడ్ తింటున్నారు, పోషకాహారం తీసుకుంటున్నారా లేదా అనే విషయంలో దృష్టి పెట్టాలి. ఈ దశలో ఏర్పడే అలవాట్లే వారి భవిష్యత్ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. స్నేహితులు, సావాసం: టీనేజ్ వయసులో పిల్లలు చెడు సావాసాలు, వ్యసనాలు లేదా బెదిరింపుల బారిన పడే ప్రమాదం ఎక్కువ. తమకు ఏదైనా సమస్య ఎదురైనా పిల్లలు బయటకు చెప్పకపోవచ్చు. అందుకే వారి ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది, ప్రవర్తనలో మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది గమనిస్తూ, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి తెలుసుకోవాలి.తల్లిదండ్రులకు మరికొన్ని ముఖ్యమైన సూచనలు పోలీసింగ్ వద్దు - సంభాషణ ముద్దు: పిల్లలను నిరంతరం అనుమానిస్తున్నట్లు లేదా గూఢచర్యం చేస్తున్నట్లు కాకుండా, ఒక స్నేహితుడిలా మాట్లాడండి. సమస్య వస్తే మీతో పంచుకోవచ్చనే భరోసా ఇవ్వండి. డిజిటల్ రూల్స్ ముందే నిర్దేశించండి: రాత్రి పడుకునే ముందు ఫోన్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లకపోవడం, స్క్రీన్ టైమ్ లిమిట్ వంటి నియమాల్ని ఇంట్లో అందరికీ వర్తించేలా అమలు చేయండి. నమ్మకాన్ని పెంచండి: వారు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అభినందించండి. మీరు వారిని నమ్ముతున్నారని తెలిస్తే పిల్లలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు.డిజిటల్ పర్యవేక్షణ ఎలా చేయాలి? రహస్య నిఘా వద్దు: వారి ఫోన్ల్ని దొంగతనంగా చెక్ చేయడం వల్ల పిల్లల్లో నమ్మకం పోతుంది. "ఇది మీ భద్రత కోసమే" అని స్పష్టంగా చెప్పి, వారి అనుమతితోనే పేరెంటల్ కంట్రోల్ యాప్స్ లేదా స్క్రీన్ టైమ్ లిమిట్స్ సెట్ చేయండి. ఆన్లైన్ భద్రతపై అవగాహన: సైబర్ బుల్లీయింగ్, ఫేక్ ప్రొఫైల్స్, వ్యక్తిగత ఫోటోలు లేదా సమాచారం షేర్ చేయడం వల్ల వచ్చే నష్టాల్ని కథల రూపంలో లేదా వార్తల ద్వారా వారికి వివరించండి.మూడ్ స్వింగ్స్ - భావోద్వేగ మార్పుల్ని అర్థం చేసుకోవడం హార్మోన్ల మార్పులు: 10–16 ఏళ్ల మధ్య శారీరక, హార్మోన్ల మార్పుల వల్ల పిల్లలు త్వరగా కోపగించుకోవడం లేదా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. దీనిని పొగరుగా భావించకుండా, వారికి కాస్త సమయం ఇవ్వండి. జడ్జ్ చేయకుండా వినడం: వారు తమ సమస్యల్ని చెప్పినప్పుడు వెంటనే తిట్టడం లేదా ఉపన్యాసాలు ఇవ్వడం ఆపండి. ముందు వారు చెప్పేది పూర్తిగా విని, ఆ తర్వాత పరిష్కారం సూచించండి.గమనికఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.