
నమన్‌ధీర్, నబిలకు తొలి అవకాశం విండీస్‌తో వన్డే, టీ20లకు భారత జట్లు దిల్లీ నమన్‌ ధీర్ ఆకిబ్‌ నబి వె స్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ బుధవారం ప్రకటించింది. చాన్నాళ్లుగా వన్డే జట్టులో అవకాశం దక్కించుకోలేకపోతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. వీళ్లిద్దరికీ టీ20ల్లోనూ అవకాశం దక్కలేదు. హరియాణా ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్, జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబి తొలిసారిగా భారత వన్డే జట్టులో చోటు సంపాదించారు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో పాటు హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. ఆంధ్ర కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి రెండు ఫార్మాట్లకూ ఎంపికయ్యాడు. పని భార నిర్వహణలో భాగంగా సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రాకు విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం అఫ్గాన్‌తో సిరీస్‌ ఆడుతున్న అతను.. త్వరలో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలోని వన్డే జట్టుకు అనుకున్నట్లే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆసియా క్రీడల్లో తలపడనున్న టీ20 జట్టునే చాలా వరకు విండీస్‌తో సిరీస్‌కు కొనసాగించిన సెలక్టర్లు.. యశ్‌ ఠాకూర్, విప్రాజ్‌ నిగమ్‌ల స్థానంలో మయాంక్‌ యాదవ్, ప్రిన్స్‌ యాదవ్‌లను ఎంపిక చేశారు. విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఈ నెల 27న మొదలవుతుంది. తర్వాత అయిదు టీ20ల సిరీస్‌ జరుగుతుంది. భారత వన్డే జట్టు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), ధ్రువ్‌ జురెల్, నితీశ్‌కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్, మహ్మద్‌ సిరాజ్, ఆకిబ్‌ నబి, యశస్వి జైస్వాల్, నమన్‌ ధీర్‌. టీ20 జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్, తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబె, కుల్‌దీప్, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్, అర్ష్‌దీప్‌ సింగ్, ప్రిన్స్‌ యాదవ్, మయాంక్‌. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.