© 2026 nimisham.in
Tata Car Price Increase September 1: కొత్తగా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాకులు తగులుతున్నాయి. దిగ్గజ కార్ల తయారీ సంస్థలు వరుసగా కార్ల ధరల్ని పెంచుతుండటమే కారణం. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపుపై ప్రకటన చేయగా, తాజాగా టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కూడా ధరల్ని పెంచుతున్నట్లు ( Tata Motors Car Price Hike) ప్రకటన చేసింది. తమ కార్లు, SUV లపై ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లను బట్టి గరిష్ఠంగా రూ. 25 వేల వరకు పెంచుతామని స్పష్టం చేసింది. ఈ కొత్త సవరించిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ముడి సరకులు, ఇతర కమొడిటీ ధరలు పెరుగుతున్న తరుణంలో ధరల్ని తప్పక పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ధరల పెంపు తమ అన్ని రకాల వాహనాలపై (పోర్ట్‌ఫోలియో) వర్తిస్తుందని, అయితే మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో తేడా ఉంటుందని వివరించింది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EV) రెండింటిపైనా ఉంటుందని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం కూడా ఇక్కడ ధరల పెంపునకు ప్రధాన కారణంగా ఉందని చెబుతోంది.టాటా మోటార్స్ ఈ త్రైమాసికంలోనే ఏకంగా రెండు సార్లు ధరల పెంపును ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జూన్ నెలలో ఒకసారి తమ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అది జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో కొంత కాలంగా ధరలు భారీగా పెరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. గతేడాది జీఎస్టీ సంస్కరణలతో కార్ల ధరలు భారీగా తగ్గగా, మళ్లీ ధరల పెంపుతో ఆ స్థాయికే చేరుతున్నట్లు తెలుస్తోంది.Read Also: జులైలో అత్యధికంగా అమ్ముడుబోయిన కార్లు ఇవే
.. వార్నీ మారుతీ నుంచే 6 మోడల్స్ ఉన్నాయిగా!ఇక కొద్ది రోజుల కిందట భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా, అలాగే హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచేశాయి. మారుతీ సుజుకీ ఆగస్టులోనే ఏకంగా మోడళ్లను బట్టి గరిష్ఠంగా రూ. 30 వేల వరకు ధరల్ని పెంచేసింది. అత్యధికంగా బాలెనోపై రూ. 30 వేల వరకు పెరగ్గా, ఇ- విటారా రూ. 20 వేల వరకు, జిమ్నీ కార్లపై రూ. 15 వేల వరకు పెరిగాయి. మిగతా వ్యాగన్ ఆర్, సెలెరియో, ఆల్టో కే10, బ్రెజ్జా, స్విఫ్ట్, ఎర్టిగా, డిజైర్‌పై కూడా రూ. 2500 నుంచి రూ. 7 వేల వరకు ఎగబాకాయి. ఇక హ్యుందాయ్ కూడా తమ అన్ని వేరియంట్లపై ఒక శాతం వరకు ధరల్ని పెంచుతున్నట్లు, ఇది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు ఇది జనవరి, ఏప్రిల్‌లో ధరల్ని పెంచగా ఇది ఈ ఏడాదిలో మూడోసారి కావడం గమనార్హం.