
తమిళ సినీ పరిశ్రమలో థియేటర్, ఓటీటీ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో సెప్టెంబర్ 1 నుంచి కార్యకలాపాలు స్తంభించనున్నాయి. కొత్త తమిళ సినిమాల విడుదలలు పూర్తిగా నిలిపివేయడంతో పాటు షూటింగ్లు, నిర్మాణానంతర పనులు కూడా ఆపాలని నిర్మాతల సంఘాలు ప్రకటించాయి. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కీలక ప్రకటన చేశాయి. ఆగస్టు 22న చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చాయి. దీంతో సెప్టెంబర్ ప్రారంభం నుంచే తమిళ సినీ పరిశ్రమ కార్యకలాపాలపై పెను ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్లలో విడుదలైన సినిమాలకు 8 వారాల ఓటీటీ గడువు తప్పనిసరి చేయాలన్న డిమాండ్. తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం, డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఈ నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత 8 వారాలు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల చేయబోమని నిర్మాతలు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. అలాంటి హామీ ఇచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేశాయి. నిర్మాతలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిబంధన విధించడాన్ని నిర్మాతల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సినిమాల విడుదలలు నిలిపివేయడం ద్వారా తమ అభ్యంతరాన్ని తెలియజేయాలని నిర్ణయించాయి. నిర్మాతల వాదన ప్రకారం తమిళనాడులో ప్రతి సంవత్సరం 250కి పైగా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వాటిలో అత్యధిక చిత్రాలు ఆశించిన ఆదాయం సాధించలేక నిర్మాతలకు ఆర్థిక నష్టాలను మిగులుస్తున్నాయని వారు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిని తిరిగి పొందడంలో ఓటీటీ హక్కులు కీలకంగా మారాయని నిర్మాతల సంఘాలు పేర్కొంటున్నాయి. 8 వారాల గడువును తప్పనిసరి చేస్తే ఓటీటీ ఒప్పందాలపై ప్రభావం పడుతుందని వారి వాదన. ఇదిలా ఉండగా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి ఏకపక్ష నిబంధన లేదని నిర్మాతలు