
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు మూడో వికెట్‌ను నష్టపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో (20.5వ ఓవర్) వికెట్ల ముందు దొరికిపోయాడు. డీఆర్ఎస్ తీసుకున్నా ఫలితం భారత్‌కు అనుకూలంగా రాలేదు. సమీక్షలోనూ బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. దీంతో 81 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజ్‌లోకి రిషభ్ పంత్ (1*) క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 82/3. క్రీజ్‌లో పంత్‌తోపాటు దేవదత్ పడిక్కల్ (35*) ఉన్నారు. ఈసారి కేఎల్ రాహుల్ (35)కు అదృష్టం కలిసిరాలేదు. భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. ప్రభాత్ జయసూర్య వేసిన 14.4వ ఓవర్లో కేఎల్ షాట్ కొట్టగా.. మిడాన్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిలన్ చేతికి చిక్కాడు. దీంతో పడిక్కల్ (29*)తో కలిసి రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజ్‌లోకి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5*) వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 16 ఓవర్లకు 72/2. దీంతో భారత్ ఆధిక్యం 250 పరుగులకు చేరింది. తొలి ఓవర్లోనే వికెట్‌ను కోల్పోయిన భారత్‌ను ఆదుకొనేందుకు కేఎల్ రాహుల్ (25*) - దేవదత్ పడిక్కల్ (21*) ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ప్రభాత్ జయసూర్య వేసిన (10.6వ ఓవర్) బంతిని ఆడబోగా ప్యాడ్లను తాకింది. వెంటనే శ్రీలంక ఆటగాళ్లు అప్పీలు చేశారు. అంపైర్ ఔట్ ఇచ్చాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని దేవదత్ పడిక్కల్ డీఆర్ఎస్ తీసుకోమని కేఎల్‌కు సూచించాడు. సమీక్షలో బంతి వికెట్లను తాకడం లేదని తేలింది. ఆనందంతో కేఎల్ వెంటనే దేవదత్‌ను హగ్ చేసుకొని రక్షించావు అంటూ ముద్దు చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 12 ఓవర్లకు 49/1. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అసిత బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం క్రీజ్‌లోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన కేశవ బౌలింగ్‌లోనూ పడిక్కల్ బౌండరీ కొట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 ఓవర్లకు 9/1. క్రీజ్‌లో పడిక్కల్ (8*), కేఎల్ రాహుల్ ఉన్నారు. శ్రీలంక, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది. ఇవాళ కూడా ఆటను పావుగంట ముందుగానే అంపైర్లు ప్రారంభించారు. టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మొదటి సెషన్లో దూకుడుగా ఆడి పరుగులు రాబడితేనే భారత్ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో వేగంగా ఆడాల్సిందే. గాలె పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో స్పిన్‌ను ఎదుర్కొని ఆడటం సవాలే. అందుకే, ప్రత్యర్థి ముందు కనీసం 350-400 వరకు లక్ష్యం ఉంచగలిగితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ 462/10. శ్రీలంక 284/10.