
శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. వర్షాకాలంలో ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ సంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శివుడు, పార్వతీ దేవి, విష్ణువులను ఆరాధిస్తూ భక్తులు ఈ నెలలో వివిధ పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా సోమవారాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. శుక్రవారాల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. నాగ పంచమి, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పర్వదినాలు కూడా ఈ కాలంలోనే వస్తాయి. శ్రావణ మాసంలో మాంసాహారం తీసుకోకపోవడానికి ప్రధానంగా రెండు కోణాలను ప్రస్తావిస్తారు. ఒకటి ఆధ్యాత్మిక విశ్వాసం, మరొకటి ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆరోగ్యపరమైన కారణాలు. శ్రావణ మాసాన్ని శివుడికి అంకితమైన పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ సమయంలో పూజలు, వ్రతాలు, ధ్యానంపై ఏకాగ్రత కోసం సాత్విక ఆహారం తీసుకోవాలని సంప్రదాయాలు సూచిస్తాయి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. మాంసాహారం తామసిక ఆహారంగా భావించి దూరంగా ఉంటారు. ఇది బద్ధకం, చంచలత్వం వంటి భావాలను పెంచుతుందని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. మాంసాహారాన్ని పక్కనపెట్టి కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలని పండితులు చెబుతారు. మరోవైపు శ్రావణ మాసం సాధారణంగా వర్షాకాలంతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది.మాంసాహారం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కడుపులో ఇన్ఫెక్షన్లు, అజీర్తి సమస్యలకు దారితీస్తుంది