
జ్యోతిష శాస్త్రంలో జన్మ రాశికి ఎంత ప్రాధాన్యం ఉందో జన్మ లగ్నానికీ అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కొక్క లగ్నంలో జన్మించిన వాళ్లు ఒక్కో రకమైన లక్షణాలను కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో పేర్కొన్నారు. మేష లగ్నంలో పుట్టినవారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో, ఈ లగ్నంలో జన్మించిన స్త్రీ, పురుషులకు అదృష్టం కలిసి రావాలంటే ఆచరించాల్సిన విధివిధానాలేంటో పరిశీలిస్తే.. మేష లగ్నంలో జన్మించిన వారి లక్షణాలను గురించి జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో ఓ ప్రత్యేకమైన శ్లోకాన్ని చెప్పారు. అదేంటంటే.. చండాభిమాని గుణవాన్‌ సకోపః సహృద్విరోధిచ సఖాపరేషాం| పరాక్రమ ప్రాప్త యసో విశేషో మేషోదయే యహపురుషో అతిరోషః|| ఈ శ్లోకాన్ని బట్టి మేష లగ్నంలో పుట్టినవారి లక్షణాలేంటంటే.. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ. మంచి గుణాలు కలిగి ఉన్నప్పటికీ తొందరగా కోపం వస్తుంది. తమకు బాగా దగ్గరైనవారు, సన్నిహితులతో కొన్ని విషయాల్లో విభేదిస్తున్నప్పటికీ.. తమకు దగ్గరికాని వాళ్లతో అనుకూలంగా ప్రవర్తించే లక్షణం వీరి సొంతం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరాక్రమంతో దాన్ని అధిగమించగలిగిన వారిగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పొందేవాళ్లుగా ఉంటారు. మేష లగ్నంలో జన్మించినవారెవరైనా సరే ఎక్కువగా పరాక్రమంతో పాటు కోపం, రోషం కలిగిన వారుగా ఉంటారని పైన పేర్కొన్న శ్లోకం తెలియజేస్తోంది. మేష లగ్నానికి పంచమాధిపతి సూర్యుడు గనక ఈ లగ్నంలో జన్మించినవారు ప్రభుత్వ సంబంధమైన, సాహసోపేతమైన ఉద్యోగాల్లో రాణించే అవకాశం ఉంటుందని జ్యోతిష ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నాయి. మేష లగ్నానికి ఆది, సోమ, మంగళ, శుక్రవారం, శనివారం అనుకూలమైన వారాలు. బాగా కలిసొస్తాయి. జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న జాతక దోషాల తీవ్రతను తగ్గించుకొనేందుకు గురువారం ఉపవాసం ఉంటే మంచిది. వీళ్లకు కలిసొచ్చే అంకెలు 1, 9. కలిసిరాని అంకెలు 6,7. మేష లగ్నం వారికి సింహ లగ్నం, ధనుస్సు లగ్నం వారితో అనుకూలత అధికం. ఎందుకంటే.. మేష, సింహ, ధనుస్సు.. ఈ ముడు లగ్నాలూ అగ్నితత్వ లగ్నాలని గ్రంథాల్లో చెప్పారు. అందుకే మేష లగ్నం వారు సింహ లగ్నం , ధనుస్సు లగ్నం వారితో స్నేహం చేసినా, వ్యాపారాలు ప్రారంభించినా అనుకూలతలు ఎక్కువ. మేష లగ్నంలో పుట్టిన వారు ఎవరైనా సరే.. ఈ లగ్నానికి అధిపతి కుజుడు గనక.. కుజుడికి అధిష్టాన దైవాలైన సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీనరసింహ స్వామిలను ఎక్కువగా పూజిస్తే సమస్త శుభఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.