© 2026 nimisham.in
కేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పగించేందుకు సింగరేణి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ గనులను గని అభివృద్ధి, నిర్వహణ(ఎండీవో) విధానంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు పరిశీలన చేస్తోంది. జాతీయ సంస్థలైన కోల్ ఇండియా, వెస్ట్రన్స్ కోల్ఫీల్డ్స్లలో ఈ విధానం అమలుతో నష్టాలు తగ్గించుకున్న నేపథ్యంలో అదే బాటలో సింగరేణి సైతం వెళ్లాలని భావిస్తోంది. ముందుగా ప్రయోగాత్మకంగా మందమర్రి ప్రాంతంలోని శాంతి ఖని భూగర్భ గనిని అప్పగించేందుకు ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా ఒక కంపెనీ ముందుకొచ్చింది. దీంతో సింగరేణి సంస్థ త్వరలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది.బొగ్గు గనులను ప్రైవేటు సంస్థకు ఇస్తే.. అది సొంత ఖర్చుతో బొగ్గు తవ్వి సింగరేణికి నిర్ణీత ధరకు అప్పగిస్తుంది. ఆ తర్వాత దాన్ని మార్కెట్లో సింగరేణి అమ్ముకుంటుంది. ప్రస్తుతం శాంతిఖని గనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి సింగరేణికి రూ.21,558 ఖర్చవుతుంది. వెలికితీసిన బొగ్గును కేవలం రూ.4,167కే విక్రయిస్తున్నందున సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఎండీవో విధానంలో అప్పగించి ఈ నష్టాన్ని తగ్గించాలనేది సింగరేణి సంస్థ యోచన. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడం.. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ప్రస్తుతం తీవ్ర ప్రభావం చూపుతోంది. యూజీ గనుల్లో ఉద్యోగుల జీతాలు.. స్థిర, చర వ్యయం కలిపి టన్ను బొగ్గు ఉత్పత్తికి, మార్కెట్లో విక్రయధరకు మధ్య అసలు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. 2025 చివరి నాటికి మొత్తం 22 భూగర్భ గనులకుగాను 21 నష్టాల్లో ఉన్నట్లు ఈ సంస్థ కేంద్రానికి ఇచ్చిన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ 21 గనుల నష్టాలు రూ.1,924 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పింది.ఆడ్రియాల యూజీ గనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి మొత్తం వ్యయం రూ.30,333 కాగా విక్రయ ధర రూ.2,492 మాత్రమే ఉందని సంస్థ వెల్లడించింది. టన్నుకు ఏకంగా రూ.27,841 నష్టం వాటిల్లుతోందని.. ఈ ఒక్క
గనిలోనే గతఏడాది రూ.302.87 కోట్ల నష్టం వచ్చినట్లు పేర్కోంది. సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఓపెన్ కాస్ట్ గనులను నిర్వహిస్తోంది. ఉపరితల గనుల్లో భారీ యంత్రాలతో అధిక ఉత్పత్తి సాధించే అవకాశం ఉండటంతో టన్నుకు ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇలా భూగర్భ గనుల నష్టాలను ఓసీలతో వచ్చే లాభాలతో సరిచేస్తున్నారు. ఇవి లేకుంటే సింగరేణి సంస్థ ఈపాటికే నష్టాల్లో మునిగిపోయేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.