
ఇంటర్నెట్ డెస్క్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలనే పీవీ సింధు కల చెదిరింది. ప్రిక్వార్టర్స్‌లో నంబర్ 3 సీడెడ్ ప్లేయర్ వాంగ్ జి యీ చేతిలో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన పోరులో 11-21, 21-15, 17-21 తేడాతో పరాజయం చవిచూసింది. అయితే, వాంగ్ మధ్యమధ్యలో గాయం పేరుతో విరామాలు తీసుకుంటూ ఉండటంతో సింధు ఏకాగ్రత కోల్పోయింది. తాను మరింత ఓపికగా ఆడాల్సిందని చెప్పింది. అసలేం జరిగింది? నిబంధనలు ఏం చెబుతున్నాయి? వాంగ్ తీరుపై విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఆమె తీసుకున్న విరామాలే. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వాంగ్ ఆటను కొనసాగించలేని స్థితిలో ఎప్పుడూ కనిపించలేదు. అయినా సరే గాయం పేరుతో విరామాలు తీసుకుంది. నిబంధనల ప్రకారం.. అవసరమైతేనే ర్యాలీల మధ్య 25 సెకన్ల వ్యవధిని పొడిగించే అవకాశం అంపైర్లకు ఉంది. కానీ, వాంగ్ మాత్రం అదనంగా సమయం తీసుకొంది. కోల్డ్ స్ప్రేను అందించే విషయంలోనూ రెండేళ్ల కిందటే రూల్స్ మారాయి. మ్యాచ్ లేదా విరామ సమయాల్లో టోర్నమెంట్ వైద్యులు సదరు ప్లేయర్‌కు కోల్డ్ స్ప్రేను అందించకూడదు. ప్లేయరే స్వయంగా చేసుకోవాలి లేదా తమ వైద్య సిబ్బంది ద్వారా చేయించుకోవచ్చు. ఇక్కడ కూడా సమయం ఎక్కువగా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తొలి గేమ్‌ను 11-25తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో బలంగా పుంజుకుంది. ప్రత్యర్థికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా 21-15తో గెలుచుకుంది. ఇక నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌లోనే అసలు డ్రామా మొదలైంది. ఇద్దరు ప్లేయర్లు నువ్వా? నేనా? అన్నట్లుగానే పోరాడారు. ఒక దశలో 8-4తో సింధు ముందంజలో ఉంది. అప్పుడే వాంగ్ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడింది. విరామం తీసుకుంది. మళ్లీ 13-10తో సింధు లీడ్‌లో ఉన్నప్పుడూ వాంగ్ ఆటకు విరామం తీసుకుంది. దీంతో సింధు ఏకాగ్రతను కోల్పోయింది. ఆట పునఃప్రారంభం తర్వాత వాంగ్ వరుసగా ఐదు పాయింట్లను సాధించి 15-13తో దూసుకెళ్లింది. ఈ దశలో పుంజుకున్న సింధు 16-15తో ఆధిక్యంలోకి వచ్చింది