
అమిత్ రాయ్ తెరకెక్కించిన హిందీ సినిమా 'ఓ మై డాగ్' ఆగస్ట్ 7న విడుదలైంది. ఇది అందరూ తప్పక చూడాల్సిన సినిమా అని తెలుగు దర్శకుడు శశికిరణ్ తిక్క అంటున్నారు. అమిత్ రాయ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ, పవన్ మల్హోత్రా, శ్రీధర్ దూబే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై డాగ్’. రాజేష్ భరద్వాజ్, అమిత్ రాయ్, సనా వార్సీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. ఈ సినిమా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి దర్శకుడు శశికిరణ్ తిక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ, 'నేను హైదరాబాద్కు ఎన్నోసార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారితో పాటు ఎంతోమందిని కలిశాను. కొన్ని ప్రాజెక్టులు కూడా అనుకున్నాం. కానీ అవి కుదరలేదు. అయితే 'ఓ మై డాగ్' మూవీకి కథ నేను రాయలేదు. నిజానికి ఈ కథను నాతో డాగ్సే రాయించాయి. నాలుగేళ్ల క్రితం ఆస్కార్ నా జీవితంలోకి వచ్చాడు. అప్పటి నుంచి నేను తనను దగ్గరుండి చూసుకునే వాడిని. కానీ ఒక నెల తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది. నేను ఆస్కార్ ను చూసుకుంటున్నానని అనుకున్నాను. కానీ నిజానికి ఆస్కార్ నన్ను చూసుకుంటున్నాడు. అక్కడి నుంచే ఈ కథకు స్ఫూర్తి వచ్చింది. మన నిజాయితీని నిరూపించుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్తాం. అదే విధంగా డాగ్స్ తమ ప్రేమను, నిజాయితీని నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాయి. అదే ఈ కథకు మూలం. డాగ్స్ మనకు సహానుభూతిని, ప్రేమను, కరుణను ఎలా నేర్పిస్తాయనేది ఈ సినిమా ద్వారా చూపించాం. ఈ మూవీ మీరు తప్పకుండా చూడండి. మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ కథ మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో ప్రేమను నింపుతుంది'